Sunday, September 28, 2025
E-PAPER
Homeజోష్నిరంతర పోరాట స్ఫూర్తి

నిరంతర పోరాట స్ఫూర్తి

- Advertisement -

వేల కాగడాలు ఏకమైతే.. లక్ష గొంతులు ఒక్కటైతే .. కోటి ఆశలు నిలువెల్లా నింపుకుంటే.. అతనొకడవుతాడు . జాతి ఆత్మ ఘోష గుండెలనిండా పెట్టుకుపుట్టినవాడు. అతడు మొక్కనాటితే అది తుపాకీ చెట్టు అవుతుంది. అతడో మాట మాట్లాడితే తూటాలా పేలుతుంది. అతడు పిడికిలి బిగిస్తే జనం వందలు వేలుగా వెంట నడుస్తారు. ‘రంగ్‌ దే బసంతీ’ అని అతడు పాట పాడితే తనను బంధించిన జైలు సిబ్బంది కూడా మంత్ర ముగ్ధులైపోవలసిందే. భారతజాతి ముద్దుబిడ్డ. భారత జాతి దాస్య శృంఖలాలను తెంచేయాలని తన జీవితాన్ని ఫణంగా పెట్టిన విప్లవజ్యోతి భగత్‌ సింగ్‌. ఆయన జీవిత చరిత్రలోకి వెళ్లడం అంటే మనమిప్పుడు పీల్చే స్వేచ్ఛావాయువుల గురించి తెలుసుకోవడమే.


స్వాతంత్ర సమరంలో యువతకు అతడు ఉడుకు నెత్తురెక్కించిన ఉత్తుంగ తరంగం . శాంతి శాంతి శాంతి అంటూ కూర్చుంటే కుదరదంటే కుదరదని తెగేసి చెప్పిన సమరగీతం . తెల్లదొరల గుండెలదరగొట్టిన గాంభీర్యం. చిన్న వయసులో పెద్ద త్యాగం చేసిన శూరత్వం. ఏం ధైర్యం? ఎంత సాహసం? ఎంత ఆవేశం? సరిగ్గా అదే సమయంలో ఎంత సంయమనం? అని ఆశ్చర్యం చెందుతారు ఆయన పోరాట పటిమ గమనించిన వారు.

”స్వాతంత్రం కోసం మెలిపెట్టినారు మీసమూ.. /ఈనాటి యువతకు ఇచ్చినారు చక్కని సందేశం—
రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌ లతో కలసి భగత్‌ సింగ్‌.. ‘మేర రంగ్‌ దే బసంతి చోలా.. మేర రంగ్‌ దే బసంతీ..’ అని పాడుతూ ఉల్లాసంగా ఉరికంబం ఎక్కడానికి వచ్చాడు ఆఖరి కోరికేమిటని అడిగిన ఆధికారి గుండెలదిరెలా .. ”మా కట్లు విప్పితే ఒకరికొకరు కౌగిలించుకుంటామని’ అంటే మరణ్నాని కూడా దేశ సేవగానే భావించారు. బయట నుంచొకపక్క ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదాలు మింనంటుతుంటే . లోపల ఆ మిత్రులు ముగ్గురూ ఒకరికొకరు హత్తుకుంటుంటే.. అక్కడి బండరాళ్లు సైతం కన్నీళ్లు కార్చాయి . ఆ ఉరితాళ్లు కాసేపు తమకు తాము పూలమాలల్లా మారిపోయాయి. ఇలాంటి పునీతుల మెడలలో చెరుతున్నందుకు ఆనందించాలో ఆవేదన చెందాలో తెలియాలేదు వాటికి ఆ ముగ్గురుయోధులు మత్యువును ధీమాగా ఎదుర్కొంటున్న విధం చూసి భరతమాత ‘పుత్రులారా మిమ్ము గన్న నా జన్మ ధన్యమైందిరా అంటూ ఒక్కసారిగా లోలోన ఆక్రోసించింది. అక్కడి గాలి సైతం … ”అశేషప్రజానీకం స్వేచ్ఛావాయువులు పీల్చుకోడానికై మిమ్మల్ని మీరు అర్పించుకుంటున్నారా వీరులారా” అని ఎలుగెత్తి చాటింది. ఆకాశం ఆ కాని దశ్యాన్ని చూడలేక కాసేపు తటపటాయించింది. ఉరికంబం ఎకడానికి ముందు భగత్‌ సింగ్‌ అక్కడున్న ఒక ఆంగ్ల మేజిస్ట్రేట్‌ ను చూసి ”మేజిస్ట్రేట్‌ సార్‌! మీరు నిజంగా చాలా అదష్టవంతులు. భారతీయ విప్లవకారులు తమ మహత్తరమైన లక్ష్యసాధన కోసం నవ్వుతూ ఎలా ప్రాణాలరిస్తున్నారో చూసే అవకాశం మీకు దొరికిందని” చెపుతుండగా ఒకింత బాధగా తలారి వారి కాళ్ల కింద ఆధారాలను తప్పించాడు. అంతే భారతీయుల గుండెలొకసారిగా జల్లుమన్నాయి ఆ గాయం రేపిన క్షణాలు ప్రతి హదయంలో నేటికీ పచ్చినే వున్నాయి.



తెల్లవారిని తరిమికొట్టడానికి భగత్‌ సింగ్‌ వాడిన నినాద ఆయుధం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌. 23 ఏళ్లకే జాతికి ప్రాణాలను ధారబోసిన షాహిద్‌ భగత్‌ సింగ్‌.. 1907 సెప్టెంబర్‌ 28న పుట్టాడు. భగత్‌సింగ్‌ కలలుగన్న సార్వభౌమాధికారం, లౌకికతత్వం, సోషలిజం కోసం పోరాడుతున్న నేటితరానికి గొప్ప స్ఫూర్తి చిహ్నం. సామ్రాజ్యవాదానికీ, పెట్టుబడిదారీ వ్యవస్థకు, భూస్వామ్య సమాజానికీ, కుల మతతత్వాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలకు భగత్‌సింగ్‌ పోరాటపటిమ స్ఫూర్తినిస్తూనే వుంటుంది. ‘భారత ప్రజల మనసుల్లో భగత్‌సింగ్‌, అతని సహచరుల పేర్లు శాశ్వతంగా నాటుకుపోయాయి. వారు ప్రజల ఆలోచనల్లో ఓ భాగమైపోయారు. బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచారు’ అంటారు బిటి రణదివె.

భిన్న మతాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కతులకు నిలయమైన ఈ దేశాన్ని ఏకశిలా సదశంగా మార్చే కుట్రలు కుతంత్రాలు అత్యంత వేగంగా బలంగా జరుగుతున్న సందర్భంలో మనమున్నాం. మత విశ్వాసం విద్వేషంగా మారి మన రాజ్యాంగ స్ఫూర్తికే సవాలు విసురుతోంది. మన ప్రజాస్వామ్యం మునుపెన్నడూ లేనంతగా ప్రమాదంలో పడింది. కుల మతాలకు అతీతంగా కలిసి బతికే సమాజంలో సామరస్యం బీటలువారుతోంది. ప్రజాజీవితంలో భయం రాజ్యమేలుతోంది. ఒక అభద్రతాభావం వెంటాడుతోంది. వాస్తవాల్ని మరుగుపరచి అబద్ధాల పునాదుల మీద మిథ్యా చరిత్రని నిర్మించే మిత- మతవాద రాజకీయాలు సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. హింసని గ్లోరిఫై చేసి యువతని అమానవీయంగా తయారుచేస్తున్నాయి. దీనిని ప్రశ్నించాల్సిన పౌర సమాజం మౌనంగా వీక్షిస్తోంది. యీ మొత్తం సందర్భాన్ని మనం ఎలా చూడాలి? ఎలా ఎదుర్కోవాలి? పాలక మనువాదం దేశాన్ని నియంతత్వం వైపు, కాలం చెల్లిన మధ్య యుగాల తిరోగమన విలువల వైపు నడుపుతున్న ఈ వర్తమానంలో లౌకిక, ప్రజాస్వామిక శక్తుల పాత్ర యెలా వుండాలి? ఈ ప్రశ్నలన్నిటికీ భగత్‌ సింగ్‌ ఆలోచనలు సమాధానం చెపుతాయి.

”బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్‌ దాస్య శఖంలాల నుంచి భరతమాతను విడిపించడం”. 1929 ఏప్రిల్‌ 8 న బీకే దత్‌ తో కలసి, భగత్‌ సింగ్‌.. ఢిల్లీ పార్లమెంటు పై బాంబు విసిరాడు. భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌ ల మీద మర్డర్‌ కేసు నమోదయింది. జైల్లోని ఖైదీల అవసరాలను తీరముని కోరుతూ 114 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్ష చేసాడు షాహిద్‌ భగత్‌ సింగ్‌. జైల్లో వున్న సమయంలో సుమారు 700 పుస్తకాలు చదివారాయన. కార్ల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంజిల్స్‌ పుస్తకాలు అందులో ప్రధానమైనవి. జైల్లో వున్న న్ని రోజులూ 404 పేజీల డైరీ రాసాడు భగత్‌ సింగ్‌. 1931, మార్చ్‌ 23 న లాహార్లో సుఖ్‌ దేవ్‌, రాజ్‌ గురులతో ఉరితీతకు గురయ్యాడు విప్లవసేనాని భగత్‌ సింగ్‌. ఇదీ స్థూలంగా ఆ మహానుభావుడి చరిత్ర. ఆయన తత్త్వం ఇతర విశేషాలు తెలుసుకునే కొద్దీ నరనరాల్లో ఉత్తేజం పొంగిపొర్లక మానదు.


మార్క్సిజం వెలుగులో భారతదేశ భవిష్యత్‌ ను దర్శించాడు భగత్‌ సింగ్‌. నిస్తేజంగా పడివున్న ఈ నేలకు జవసత్వాలు కూడగట్టేందుకు అనవసరమైన భావజాలాన్ని అభివద్ధి చేశాడు. ”దోపిడీ పీడనలు, అసమానతలు లేని, శాంతి సౌబాగ్యాలతో విలసిల్లే సమసమాజ స్థాపన కోసం మన ప్రజలను సిద్ధం చేయాలి. ఈ విత్తనాలను నాటడానికి ఇప్పుడున్న పంటలన్నిటినీ ధ్వంసం చేయాలి. ముళ్లపొదలను పీకి తగల బెట్టాలి. బండరాళ్లను కంకరగా పగలగొట్టాలి. కిందపడిన వారిని పైకి లేవనెత్తాలి. అరాచకులకు మర్యాద నేర్పాలి. శ్రామిక ప్రజలను ఒక్కటి చేయాలి. ఇందుకు అడ్డుగా ఉన్న కులమతాల గోడల్ని కూలగొట్టాలి.” అంటూ తన ‘విశ్వమానవ సౌభ్రాతత్వం’లో స్పష్టం చేశాడు. ఈ లక్ష్య సాధనలో మతమౌఢ్యం ఓ ప్రధాన అవరోదం అని చెప్పాడు. దానిని అధిగమించేందుకు ఏంచేయాలో కూడా వివరించాడు.

విప్లవం హింస, తీవ్రవాదాలకు సమానమైంది కాదు. దాని తొలి లక్ష్యం దేశానికి స్వేచ్ఛను ప్రసాదించడం సామ్రాజ్య వాదాన్ని కూలదోయడం.. అయితే, అది అక్కడితో ఆగిపోకూడదు . మరింత ముందుకు ప్రయాణించాలి. ఒక మనిషిని మరో మనిషి దోచుకునే స్థితి అంతం కావాలంటాడు షాహిద్‌ భగత్‌ సింగ్‌… జోహార్‌ అమర వీరుడా జోహార్‌ అని ఎలుగెత్తుతుంది ప్రతి భారతీయుడి గుండె ఆయన గురించి తెలుసుకున్నంతనే !!!

ఆయన 12 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు జలియన్‌ వాలాబాగ్‌ దుర్ఘటన జరిగింది… ఆ సంఘటన ఆయన్ని చాలా ప్రభావితం చేసింది.. ఆ ప్రదేశానికి వెళ్ళిభూమిని ముద్దాడి, అకడ రక్తం తో తడిసిన మట్టిని ఇంటికి తీసుకు వచారు. ఈ ఒకటి చాలు ఆయన ఎంత దేశ భక్తుడో చెప్పడానికి మీరు ప్రతీన బూనిన జాలియాన్‌ వాలాబాగ్‌ మట్టే మెరుస్తాము.” వేలమంది ప్రాణాలు విడిచిన మట్టివాసనే ప్రాణవాయువుగా పీల్చుకుని బతికాడతను . తెల్లదొరల ముందు.. ధైర్యంగా మీసం మెలేసిన పౌరుషమతడు. ఉరితాడును ఎంతో ఇష్టంగా ముద్దాడిన పోరాటయోధుడు. భారతస్వాతంత్ర చరిత్రలో ఆ పేరు అరుణారుణాక్షరాలతో లిఖించారంటే అతిశయోక్తి కాదు.
”మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు” భగత్‌ సింగ్‌

  • అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -