Saturday, October 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిబంగారంపై నియంత్రణ - దేశ అభివృద్ధి

బంగారంపై నియంత్రణ – దేశ అభివృద్ధి

- Advertisement -

బంగారం మానవ జీవితంలోకి నాగరిక సమాజానికి ముందే వచ్చింది. కామన్‌ ఏరాకు ముందు నాలుగు వేలసంవత్సరాల క్రితం అంటే ఆరు వేల ఏండ్ల క్రితమే మధ్య ఆసియాలోని మోసపోటాని యాలో మైనింగ్‌ చేయడం, వినియోగించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్‌ చేయబడిన గోల్డ్‌ 2 లక్షల 16 వేల 265 (2024 చివరి నాటికి) టన్నులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ సెంట్రల్‌/ రిజర్వ్‌ బ్యాంకుల వద్ద 32 వేల 955 మెట్రిక్‌ టన్నుల బంగారం ఉండగా, భారత రిజర్వు బ్యాంకు వద్ద 880 మెట్రిక్‌ టన్నుల నిలువలు ఉన్నాయి. భారత ప్రజల వద్ద కొన్ని అంచనాల ప్రకారం 25 వేల మెట్రిక్‌ టన్నులు, భారత్‌ లోని టెంపుల్స్‌ వద్ద 5 నుండి 7 వేల మెట్రిక్‌ టన్నుల బంగారం ఉన్నది.

దీని విలువ కనీసంగా 300 లక్షల కోట్లు. ఇది భారత రియల్‌ జీడీపీ 188 లక్షల కోట్లకు 1.6 రేట్లు ఎక్కువ. బంగారం ఉత్పత్తి ఖర్చు పెద్దగా పెరగ లేదు. పది గ్రాముల బంగారం ఉత్పత్తి ఖర్చు రూ.50 నుండి 55 వేలు మాత్రమే. అయినప్పటికీ బంగారం ధర గతేడాది కాలంగా విపరీతంగా పెరుగుతోంది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షా 25 వేలకు చేరింది. దీనికి ప్రపంచ పెట్టబడిదారి సమాజాల్లో ఏర్పడిన అనిశ్చితి ప్రధాన కారణం. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అంతా తన ఉత్పత్తికి తానే ఆటంకంగా ఉంటుంది. ఈ విధానమే ప్రపంచ అనిశ్చితికి కారణమవు తున్నది. యుద్ధాలు, బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గించడం, రియల్‌ భూమ్‌ పడిపోవడం, డాలర్‌పై ఏర్పడిన అపనమ్మకం తదితర కారణాలు ఉన్నాయి.

సంపద నిలువ ప్రధానంగా నాలుగు రూపాల్లో ఉంటుంది. 1. కరెన్సీ: డబ్బు, బ్యాంకు డిపాజిట్లు. 2. విలువైన లోహాలు: బంగారం, వెండి తదితరాలు. 3.రియల్‌ ఎస్టేట్‌: భూమి, భవనాలు తదితరాలు. 4. పెట్టుబడులు: స్టాక్‌ మార్కెట్లు, బాండ్లు. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా విలువైన లోహాలు మినహా మిగతా మూడు సంపద నిల్వకు ఆందోళనకరంగా ఉన్నాయి. కరెన్సీ: బ్యాంకు వడ్డీ రేట్లు తక్కు వగా ఉన్నాయి. డాలర్‌ పై అపనమ్మకం ఏర్పడింది. స్టాక్‌ మార్కెట్లు తీవ్ర కుదుపులకు లోన్‌ అవుతున్నాయి. బ్లాక్‌ మనీని, హవాలా డబ్బును ఎక్కువగా ఇముడ్చుకునే రియల్‌ బూమ్‌ తగ్గింది. ఇక సంపద పోగుకు ఉన్న ఏకైక మార్గంగా బంగారం, వెండి కనిపిస్తున్నాయి.

సాధారణ ప్రజల నుండి డిమాండ్‌ పెరగలేదు. పైగా సాధారణ ప్రజలు శుభకార్యాల కోసం కొనే బంగారం కొనుగోళ్లు తగ్గాయి. దేశంలోని ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి, సంపన్న వర్గాల వద్ద ఉన్న ఆదాయాలు బంగారం, వెండి, భూముల్లో పెట్టడం దేశ అభివృద్ధిని కుంటుపరుస్తుంది. భూమిపై పెట్టుబడి ఒక మేరకు ఉపయోగపడుతుంది. భూమిపై నిర్మాణాలు జరిగినా, పంటలు ఉత్పత్తి చేసిన ఉపాధి కల్పించడంతోపాటు కొన్ని ప్రజా అవసరాలు తీరుతాయి. కానీ బంగారంలోకి, వెండిలోకి వెళ్లే పెట్టుబడి బ్లాక్‌ అయిపోతుంది. పైగా బంగారం ఉత్పత్తి దేశంలో 1.5 టన్నులు మాత్రమే. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. దీనివలన విదేశీ మారక ద్రవ్యం పెద్ద మొత్తంలో బంగారం, వెండి కొనుగోళ్లకు వెచ్చించబడుతుంది.

క్రూడ్‌ ఆయిల్‌ (రూ.9 లక్షల 24 వేల కోట్లు) తర్వాత ఎక్కువ మొత్తంలో బంగారం (రూ.5 లక్షల 10వేల కోట్లు) దిగుమతులకే మారక ద్రవ్యం వెచ్చించబడుతున్నది. కాళ్ల జోడు నుండి కళ్ళజోడు వరకు విదేశీ వస్తువులను ఉపయోగించే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల స్వదేశీ వస్తువులను వినియోగించాలని ప్రజలకు పిలుపునిస్తున్నాడు. కానీ బంగారం కొనుగోలు మానండి అని దేశ ప్రజలకు పిలుపునివ్వడం లేదు. మహా మాంద్యం యొక్క ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్‌ ప్రయివేటు చేతుల్లో ఉన్న బంగారాన్ని నిషేధిస్తూ 1933లో ఉత్తర్వు జారీచేశారు. ఈ చర్య అమెరికా అభివృద్ధికి ఒక అంశంగా తోడ్పడింది. ఆ తర్వాత 1975లో నిషేధాన్ని ఎత్తివేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని మహిళలు బంగారు అభరణాలు ధరించడానికి ఇష్టపడరు. మనదేశంలో మాత్రం మహిళలతో పాటు పురుషులూ పోటీ పడుతున్నారు. బంగారం రిజర్వు బ్యాంకు దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే అంత అంతర్జాతీయ మారక ద్రవ్యంగా ఉపయోగపడు తుంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయాల్లో బంగారం భద్రత వలయంగా పనిచేస్తుంది. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆదేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది.

బంగారం ప్రత్యేకత: కరెన్సీ (రూపాయి, డాలర్‌, యూరో, ఫౌండ్‌, ఎన్‌ తదితరాలు) మన దగ్గర ఉంటే మనకు అవసరమైన సరుకులు కొనుక్కోవచ్చు, అవసరాలు తీర్చుకోవచ్చు. ఉన్నపలంగా ప్రభుత్వాలు తమ కరెన్సీని రద్దు చేస్తే అప్పుడు ప్రజలు ప్రభుత్వం (బ్యాంకుల) చుట్టూ తిరగాలి. వర్చువల్‌ కరెన్సీ (ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం), క్రెడిట్‌ డెబిట్‌ కార్డులు ప్రభుత్వాల రద్దు చేస్తే, పైగా ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌, కార్డులు ప్రధానంగా అమెరికా కంపెనీల చేతిలో ఉన్నాయి. కానీ బంగారం, వెండిని ప్రభుత్వాలు రద్దు చేయలేవు. బంగారం తన సహజ విలువను కోల్పోదు. కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇంకొక అంశం సంపద డబ్బు రూపంలో ఉంటే చిన్న చిన్న అవసరాలకు కూడా ఖర్చయిపోయే స్వభావం ఎక్కువ.

భూములు, బిల్డింగుల రూపంలో ఉంటే అత్యవసరాలకు కూడా అమ్మి డబ్బు చేసుకోవడానికి వీలు కాకపోవచ్చు. కానీ కొంత సంపద బంగారం, వెండి రూపంలో ఉండడం అవసరమే. చిన్న చిన్న విషయాలకి ఖర్చు చేయ లేరు. అత్యవసరాలు అప్పుడు వెంటనే వినియోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఎంత ఉండాలి. ఇప్పుడు కూడా కొంత పరిమితి ఉంది. ఆదాయ పన్ను చట్ట ప్రకారం ఎటు వంటి డాక్యుమెంట్లు లేకుండానే వివాహిత మహిళ 500 గ్రాముల బంగారం, అవివాహిత మహిళ 250 గ్రాములు బంగారం, పురుషుడు వంద గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చును. ఇంతకు మించితే ఆదాయానికి తగిన పత్రాలు చూయించి ఎంత మొత్తమైనా బంగారం కలిగి ఉండొచ్చు. ఒక కుటుంబం గరిష్టంగా 250 గ్రాముల బంగారం మించి ఉండకుండా పరిమితి విధించాలి.

డబ్బు, బంగారం, వెండి ఉంటే వాటర్‌ కొనుక్కొని దాహం తీర్చుకోవచ్చు. ఆహారం కొనుక్కొని ఆకలి తీర్చుకోవచ్చు, బట్టలు, చెప్పులు కొనుక్కోవచ్చు. సెల్‌ఫోన్లు, బైక్లు, కార్లు, బంగ్లాలు ఇలా ఒకటేమిటి సమస్తము సమకూర్చుకోవచ్చు. కానీ ఈ సరుకుల ఉత్పత్తే లేకుంటే కొనుగోలు చేయడం, వినియోగించడం సాధ్యం కాదు. బంగారం మింగితే దాహము, ఆకలి తీరదు. బంగారం, వెండి, డబ్బు సరుకుల మారకానికి మాత్రమే ఉపయోగపడతాయి. వస్తువుల ఉత్పత్తి, పంపిణీ లేకుండా మానవ అవసరాలు తీరవు. బంగారం, వెండి రూపంలో ఉన్న సంపద వస్తు ఉత్పత్తిలోకి, ఆధునిక, ఆత్యాధునిక, పారిశ్రామిక ఉత్పత్తిలోకి, వ్యవసాయ ఉత్పత్తులలోకి రావాలి. వ్యవసాయ ఉత్పత్తులే తీసుకుంటే ఇండియాలో వరి ఎకరాకు సగటున 22 క్వింటాళ్ల దిగుబడి వస్తుంటే, అమెరికాలో 35 క్వింటాళ్లు, చైనాలో 30 క్వింటాళ్లు దిగబడి వస్తుంది. చైనా సూపర్‌ రైస్‌ (హైబ్రిడ్‌ రైస్‌ వెరైటీ) 60 క్వింటాళ్లు దిగుబడి చేసింది. ఇండియాలో పత్తి ఎకరాకు సగటున 11 క్వింటాళ్లు, ఆస్ట్రేలియాలో 26 క్వింటాళ్లు, చైనాలో 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇండియాలో మొక్కజన్న 22 క్వింటాళ్లు, అమెరికాలో 44 క్వింటాళ్లు, వియత్నాంలో 26 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఇండియా ప్రధానంగా వ్యవసాయ దేశమైనప్పటికీ, పంటలు దిగుబడి తక్కువ ఉండడానికి ప్రధాన కారణం పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డి)ని పాలకులు నిర్లక్ష్యం చేయడమే. ఇటీవల కాలంలో చెప్పుకోదగిన కొత్త వంగడాలు కనుక్కోబడలేదు. ఇక పారిశ్రామిక అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రపంచంలో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ ట్రైన్లు దూసుకుపోతుంటే 2029 నాటికి మొదటి బుల్లెట్‌ రైలు నడిపించే ప్రయత్నాల్లో మనం ఉన్నాం. సెమీ కండక్టర్లు, చిప్స్‌, చిప్‌ డిజైన్లలో అమెరికా ఆధిపత్యం వేస్తున్నది. తైవాన్‌, చైనా దూసుకుపోతున్నది. ఏ మల్టీనేషన్‌ కంపెనీతో టైఅప్‌ చేసుకొని ఇండియాలో సెమీ కండక్టర్‌ పరిశ్రమ ప్రారంభిద్దామా అనే దశలో మనం ఉన్నాం. చైనా సొంతగా ఆధునిక యుద్ధ విమానాలు తయారు చేసుకుంటే, యుద్ధ విమానాలు తయారు చేసుకోవడం కాదు కదా! యుద్ధ విమానాలు కొనుగోలు చేసుకోవడమే గొప్ప దేశభక్తిగా ప్రచారం చేసుకునే పాలకుల పరిపాలనలో మనమున్నాం. అనుత్పాదక పెట్టుబడుల పట్ల ప్రజలను నిరుత్సాహపరచాలి. చైతన్యపరచాలి. దేశం శీఘ్రగతిన అభివృద్ధి కావడానికి ఇది తక్షణ అవసరం.

గీట్ల ముకుందరెడ్డి
94900 98857

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -