సవరణకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు
ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం
కేరళంతో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోనే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వివాదాస్పద ఎఫ్సీఆర్ఏ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. మైనారిటీల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించిన ఎఫ్సీఆర్ఏ సవరణకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రతరం కావడంతో ఈ బిల్లును ఆమోదించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది. బలమైన వ్యతిరేకత, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఈ తాత్కాలిక ఉపసంహరణ జరిగింది. బుధవారం లోక్సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఎన్నికలకు ముందు కేరళ ఎంపీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ”వారు ఎఫ్సీఆర్ఏ గురించి కేరళలో అనవసరమైన అపార్థాలను సృష్టిస్తున్నారు. అసలు సవరణను 2010లో కాంగ్రెస్ తీసుకొచ్చింది.
అప్పటి నుంచి అనేక సవరణలు వచ్చాయి. ప్రస్తుత సవరణ జాతీయ భద్రత, ప్రయోజనాల దృష్ట్యా విదేశీ విరాళాలను నియంత్రించే ఉద్దేశంతో రూపొందించబడింది. ఇది ఏ మతాన్ని, కులాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఎన్నికల లక్ష్యంతో అనవసరమైన అపార్థాలను వ్యాప్తి చేస్తున్నారు” అని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వ మైనారిటీ వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సభ వెలుపలా నిరసన తెలిపాయి. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఇండియా బ్లాక్ ఎంపీలు బ్యానర్లు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నిరసనను తీవ్రం చేశారు. ఈ నిరసనలో సీపీఐ(ఎం) లోక్సభ నాయకులు కె. రాధాకృష్ణన్, అమ్రారామ్, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు.
సమావేశాల నిరవధిక వాయిదా లేనట్లే
గురువారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం లేదు. బడ్జెట్ సమావేశాలను తాత్కాలికంగా నిలిపివేసి, ఏప్రిల్ మూడో వారంలో తిరిగి సమావేశపరచడమే ఈ చర్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల తరువాత తిరిగి సమావేశమయ్యే పార్లమెంట్ ఎజెండాలో ఎఫ్సీఆర్ఏ చట్టం, మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టం వంటి ముఖ్య సవరణలు ప్రభుత్వ ఎజెండాలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో సమావేశాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, తిరిగి సమావేశపరిచేందుకు అవకాశం ఉంది.



