ఇది మానసిక క్రూరత్వం, హింస కిందకు రాదు : హైకోర్టు తీర్పు
నవతెలంగాణ-హైదరాబాద్
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేప్పుడు పనివేళలను భట్టి ఇంటిలో పనులు చేస్తుంటారనీ, ఉదయం తొమ్మిది గంటలకే ఆఫీసుకు వెళ్లాల్సిన భార్య ఉదయం పూట వంట వండలేదని చెప్పి భర్త విడాకులు కోరడం చట్టబద్ధం కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇది మానసిక క్రూరత్వం, హింస కిందకు రాదని స్పష్టం చేసింది. ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేట్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతిని 2015 మేలో పెండ్లి చేసుకోగా ఆమె అన్నం వండట్లేదనీ, తన తల్లికి సహకరించడం లేదని విడాకులు కోరుతూ భర్త వేసిన దావాను మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కోర్టు కొట్టేసింది. దీంతో భర్త హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ పూర్తి చేసి పైవిధంగా తీర్పు చెప్పింది. కింది కోర్టు తీర్పును సమర్ధించింది. భార్య తనకు వంట చేయడంలో విఫలమైందనీ, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదని చెప్పి విడాకులు కోరడాన్ని తప్పుపట్టింది. కుటుంబంలో అనేక కలతలు, గొడవలుం టాయని, వాటిని భూతద్దంలో చూపెట్టి విడిపోతామం టే వివాహ వ్యవస్థకు అర్థం లేకుండా పోతుందని తీర్పులో పేర్కొంది. అప్పీల్‌ను కొట్టివేసింది.
రుణమాఫీపై పిటిషన్
తనకు రుణమాఫీ పథకం అమలు కాలేదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని వ్యవసాయ, సహకారశాఖ, జిల్లా కలెక్టర్‌తోపాటు బ్యాంక్‌లకు నోటీసులు జారీ చేసింది. రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయలేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లెకు చెందిన బద్దం నరసింహారెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్ టి.మాధవీదేవి విచారించారు. వడ్డీతో కలిపి రైతు రుణం రూ.1.56 లక్షలేననీ, తనకు రుణ మాఫీ అమలు చేయలేదన్న పిటిషన్‌పై విచారణను ఈనెల 27కు వాయిదా పడింది.
షెడ్యూల్ ఏరియాలో రిజర్వేషన్లపై పిటిషన్
జడ్పీటీసీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లను కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏజెన్సీ ఏరియాల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ సోషల్ వర్కర్ జి.రాము, ఇతరులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ టి.మాధవీదేవి విచారించారు. అధికారులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ స్పందన లేదన్న పిటిషన్‌పై విచారణను 27కు వాయిదా పడింది.
డ్రగ్స్ కేసు కొట్టేయండి : హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
తనపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసును కొట్టివేయాలంటూ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్‌సింగ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇ.తిరుమలాదేవి మంగళవారం విచారించారు. చట్ట విరుద్ధంగా నమోదైన కేసును కొట్టేయాలని కోరారు.
తుది ఉత్తర్వులు వెలువడే వరకు కేసు దర్యాప్తును నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పోలీసుల వివరణ నిమిత్తం విచారణను 8వ తేదీకి వాయిదా వేశారు.
హైకోర్టుకు రాజాసాబ్
టికెట్ ధరల పెంపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ‘రాజాసాబ్’ నిర్మాతలు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. అఖండ-2 సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపును రద్దు చేయడంతోపాటు ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా టికెట్ ధరల పెంపుపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రయివేటు లిమిటెడ్ పిటిషన్ వేసింది. ఈ నెల 9న రాజాసాబ్ సినిమా విడుదల కానుందని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేయాలని అప్పీల్‌వేసింది. దీనిని హైకోర్టు విచారణ చేయనుంది.
విడాకులకు వంట కారణం కానేకాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



