Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకబంధహస్తాల్లోకి సహకారం!

కబంధహస్తాల్లోకి సహకారం!

- Advertisement -

నామినేటెడ్‌ పాలక మండళ్లకు సర్కార్‌ ఏర్పాట్లు
ఎన్నికల రద్దు యోచనపై విపక్షాల ఆగ్రహం
సాగు తెలియకున్నా పాలనా బాధ్యతలకు ఛాన్స్‌
విత్తనాలు, ఎరువుల పంపిణీలో లోపించనున్న సమతుల్యత
రుణాల విషయంలోనూ రైతులకు తీరని అన్యాయం
నేటి నుంచి పీఏసీఎస్‌ల ఎదుట తెలంగాణ రైతు సంఘం నిరసన

”సహకార సంఘాల ఎన్నికలను ప్రభుత్వం రద్దు చేయాలనే యోచనతో పాలన సమస్యాత్మకంగా మారనుందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాగు తెలియని అధికారులు, నాయకుల ‘చేతి’లో పెడితే రైతుకు ‘సహకారం’ లోపించే ప్రమాదం ఉందని తెలంగాణ రైతుసంఘం అంటోంది. నేటి నుంచి పీఏసీఎస్‌, డీసీసీబీల ఎదుట రైతాంగం ఆందోళనలకు సమాయత్తం అయింది.”

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోని సహకార సంఘాలకు ఎన్నికలు రద్దు చేయాలనే యోచనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌), జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాలను ఇటీవల రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏకపక్ష పాలనకు అవకాశం ఏర్పడుతుందని, ఇది రైతాంగానికి తీరని నష్టం చేస్తుందని తెలంగాణ రైతుసంఘం అభిప్రాయపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ తరహాలో ఒక్కో పీఏసీఎస్‌కు ఒక్కో చైర్మెన్‌, ఇద్దరు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీలు (పర్సన్స్‌-ఇన్‌-చార్జ్‌) నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ, ఎన్నికల వ్యయం తగ్గుతుందనే కారణాలను ప్రభుత్వం చూపుతున్నా.. రాజకీయ పట్టుకోసం కాంగ్రెస్‌ కుయుక్తులు పన్నుతున్నదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వెంటాడిన యూరియా భయం?
వానాకాలంలో ఏర్పడిన యూరియా కొరత.. ఇప్పుడు యాప్‌ దాకా వచ్చింది. రైతుల్లో చాలామంది నిరక్షరాస్యులు కావటంతో యాప్‌ను అర్థం చేసుకోవటం రైతులకు సమస్యగా మారింది. ఇది కూడా ప్రభుత్వం సహకార ఎన్నికలు రద్దు చేయటానికి కారణమై ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక విత్తనాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు, పంట రుణాలు ఇలా అనేకం పీఏసీఎస్‌ల నుంచే పంపిణీ అవుతుంటాయి. వీటి నిర్వహణ పాలకమండళ్లు ఉన్న సమయంలోనే కష్టమైంది. అటువంటిది త్రిసభ్య కమిటీ రైతులకు ఏమేరకు న్యాయం చేస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతు వ్యతిరేకత ఉన్న ప్రస్తుత తరుణంలో సహకార ఎన్నికలకు పోతే అధికార పక్షానికి ప్రతికూల ఫలితాలు వస్తాయనే కారణంతోనే నామినేటెడ్‌కు వెళ్లిందని విపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.

ప్రశ్నార్థకంగా కొత్త సొసైటీల ఏర్పాటు
కొత్త జిల్లాల్లో రైతుల సంఖ్యకు అనుగుణంగా సొసైటీలు లేకపోవటంతో ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతనంగా ఏర్పడింది. ఈ జిల్లాలో ప్రస్తుతం 21 సంఘాలున్నాయి. వీటిలో 90,249 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. కొన్ని సంఘాల్లో సభ్యులు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల కొత్తగా 8 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. ఇలాంటి తరుణంలో సొసైటీ పాలకవర్గాలను రద్దు చేయటంతో వీటి ఏర్పాటుపైనా సందేహాలు నెలకొన్నాయి. సహకార బ్యాంకు సేవలు మినహా కొత్త జిల్లాలో మిగతా సేవలు అందుబాటులో లేవు. కాబట్టి నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో సైతం డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయా లని 2024లో నిర్ణయించినా అమలుకు నోచుకోలేదు.

అధికార పార్టీ వారికే అవకాశాలు
నామినేషన్‌ విధానం అమల్లోకి వస్తే సహకార సంఘాల్లోని అన్ని కీలక పదవులు అధికార పార్టీ వారికే దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 207 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో 183 కమిటీలకు పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో అధికారపార్టీకి చెందిన దాదాపు 3వేల మందికి పైగా చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌, డైరెక్టర్‌ వంటి పదవులు దక్కాయి. ఇదే తరహాలో పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, మార్క్‌ఫెడ్‌, టెస్కాబ్‌కు కూడా నామినేటెడ్‌ పాలకవర్గాలను ఏర్పాటు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వేల మందికి పైగా అధికార పార్టీకి చెందిన వారికి పదవులు దక్కుతాయి.

సంక్రాంతిలోపు ప్రక్రియ పూర్తి..!
వీలైనంత త్వరగా పీఏసీఎస్‌ల పాలకవర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. పీఏసీఎస్‌లకు ఎన్నికలు లేకుండా నామినేటెడ్‌ పాలక మండళ్లను ఏర్పాటు చేసే అంశంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నామినేటెడ్‌ విధానంలోనైనా పీఏసీఎస్‌ల్లో సభ్యులుగా ఉన్న రైతులకే పాలకవర్గాల్లో అవకాశం కల్పించాలనే నిబంధన ప్రభుత్వం పాటించే అవకాశం ఉంది. సభ్యత్వం లేని వారికి పదువులు ఇవ్వకూడదన్న అభిప్రాయంతో ఉన్నా.. అది ఏ మేరకు నెరవేరుతుందనే అనుమానం వ్యక్తమవుతోంది.

సహకార వ్యవస్థను ధ్వంసం చేసే యోచన
సహకార సంఘాల కమిటీలకు కాంగ్రెస్‌ కార్యకర్తలను నామినేట్‌ చేయాలనే యోచనను ప్రభుత్వం విరమిం చుకోవాలి. సహకార వ్యవస్థను ధ్వంసం చేయటానికే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల సహకార సేవల్లో సమతుల్యత లోపించే ప్రమాదం ఉంది. సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో 26 నుంచి పీఏసీఎస్‌లు, డీసీసీబీల వద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చాం. బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -