మోడీ ప్రభుత్వం ‘సహకార్ సే సమృద్ధి’, ‘ప్రాస్పరిటీ త్రూ కోపరేషన్’ నినాదాలిస్తోంది. అంటే ‘సహకారం నుండి సంపద’గా మారుతుంది. ఇటీవల కేంద్ర సహకార శాఖా మంత్రి అమిత్‌షా విడుదల చేసిన జాతీయ సహకార విధానం దీనికనుగుణం గానే ఉంది. రెండున్నరేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మోడల్ బైలాస్ (నమూనా నియమావళి)కు నకలుగా జాతీయ సహకార విధానం కనిపిస్తోంది. కేవలం స్పల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల మీద వచ్చే ఆదాయంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ధృఢంగా నిలబడలేవని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పి.ఎ.సి.ఎస్ లు) నిర్వహిస్తున్న ఆర్థిక కార్యకలాపాలకు వాటి బైలాస్ (నియమావళి) ఆటంకాలు కల్పిస్తున్నాయని, అవి దశాబ్దాల కిందటివని, వాటిని తిరగ రాయాల్సిన అవసరముందని, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన లేఖల్లో పేర్కొంది. మోడీ ప్రభుత్వం సహకార రంగం పట్ల కేంద్రీకృత లక్ష్యంతో వ్యవహరిస్తోంది.
2021 జులై 6న సహకార మంత్రిత్వ శాఖను కొత్తగా ఏర్పాటు చేసి, అమిత్ షాకు ఆ శాఖ పగ్గాలు అప్పగించిన నాటి నుండి, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా వేగం పెంచింది. సహకారం నుండి వచ్చే సంపద ఎవరి కోసం? ఎవరికి దక్కుతుంది? అనేది కీలకం. రాజ్యాంగం రాష్ట్రాల హక్కుగా ఇచ్చిన సహకారాన్ని బీజేపీ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆ పార్టీకి మద్దతిచ్చే రాష్ట్రాలు, కేంద్ర సహకార శాఖ పంపించే ఆదేశాలన్నింటిని కిందికి పంపిస్తూ ఆచరణకు పూనుకుంటున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలు కూడా దీనిపై సరైన విధంగా స్పందించడంలేదు. కేరళ ఒక్కటే దీనికి మినహాయింపు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో ఒక సహకార సంఘం ఉండాలి. అన్నింటిలోకి కీలకమైనవి కేంద్ర ప్రభుత్వం పంపిన మోడల్ బైలాస్. అన్ని సహకార సంఘాలు వీటిని ఆమోదించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఈ బైలాస్ ప్రకారం సంఘం పేరులో వ్యవసాయ పరపతి అనే మాట ఉండదు. ‘ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం’ ‘బహుళ ప్రయో జన ప్రాథమిక గ్రామీణ సహకార సంఘం’గా మారుతుంది.
సహకార సంఘ సభ్యులు రెండు తరగతులుగా విభజించ బడతారు. ‘ఎ’ క్లాస్ సభ్యులకు మాత్రమే జనరల్ బాడీలకు హాజరయ్యే, నిర్ణయాల్లో భాగస్వామ్యం పొందే, డైరెక్టర్లుగా పోటీ చేసే అధికారం, ఓటింగ్ హక్కులు ఉంటాయి. ‘బి’ క్లాస్ సభ్యులకు ఎటువంటి హక్కులూ ఉండవు.’ఎ’ క్లాస్ సభ్యులు కావటానికి వ్యవసాయ భూమి లేదా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే భూమి ఉండాలి. ‘ఎ’ క్లాస్ సభ్యులు మాత్రమే వాటాదారులుగా ఉంటారు. వీరిలో ఎవరికైనా మొత్తం షేర్ ధనంలో వాటాగా ఇరవై శాతం వరకు ఉండవచ్చు. వీరి చెప్పుచేతల్లోకి సహకార సంఘాలు ఉండబోతున్నాయని వేరేగా చెప్పనక్కెర్లెదు. వ్యవసాయ భూమిగల రైతులు ‘ఎ’ క్లాస్ సభ్యులు. వివిధ ప్రయోజనాల కోసం ఆధారపడిన వ్యవసాయ రంగం, ఇందులో వ్యవసాయ ఉత్పత్తులను ముడి సరుకులుగా ఉపయోగించే పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి సేవలు అందించే పరిశ్రమలున్నాయి. అనుబంధ రంగాలు అంటే వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో పాల్గొనే సంస్థలు, పరిశ్రమలు ఉంటాయి.
అదానీ, అంబానీ, గాడ్రెజ్, ఆదిత్య బిర్లా, మోన్‌శాంటో, జువారి, ర్యాలీస్, ఐటిసి, బ్రిటానియా వంటి గుత్త సంస్థలతో పాటు అనేక పెద్ద కంపెనీలు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో ఉన్నాయి. ఇంత పెద్ద కంపెనీలకు, ‘బహుళ ప్రయోజన ప్రాథమిక గ్రామీణ సహకార సంఘం’తో పనేంటి? బహుళ ప్రయోజన సహకార సంఘంలో గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలు మొత్తం కేంద్రీకరించబడతాయి. వీటిలో ‘మీ సేవ’, ‘ఈ సేవ’లు అందించిన అనేక కార్యకలాపాలతో పాటు గోడౌన్ల ఏర్పాటు, ఆహార ధాన్యాల సేకరణ, ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ డీలర్‌షిప్, వ్యవసాయ రుణాలు, సామూహిక వ్యవసాయం, స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, చౌకధరల దుకాణాలు, పాస్‌పోర్టు సేవలు, అన్ని రకాల టిక్కెట్ల బుకింగ్, బిల్లుల చెల్లింపులే కాక వీటిలో లేని వ్యాపారం అంటూ ఏదీ ఉండదు.బహుళ ప్రయోజన సహకార సంఘాలు సభ్యుల ప్రయోజనాల కోసం మార్కెటింగ్ కార్యకలాపాలను సొసైటీ పరిధి లోపల, సొసైటీ పరిధి బయట నిర్వహిస్తాయి. ఆస్తుల సృష్టికి పనిచేస్తాయి.
లక్ష్యాల సాధనలో ఇతర వ్యాపారాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక మద్దతిస్తాయి.’బి’ క్లాస్ సభ్యులలో స్వయం సహాయక గ్రూపులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ చేతివృత్తి దారులు, చిన్న వ్యాపారస్తులు ఉంటారు. వీరికి వ్యవసాయేతర రుణాలు మాత్రమే ఇస్తారు.అంటే కౌలురైతులకు వ్యవసాయ రుణాలుండవు. వ్యవసాయేతర రుణాల వ్యాపారంలో వచ్చే ఆదాయం నుండి కొద్దిభాగం వీరికి ప్రోత్సహకంగా ఇస్తారు. ప్రధానంగా ఈ సొసైటీలు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్.పి.ఓలు) ఏర్పాటు చేస్తాయి. సామూహిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాయి. ‘ఎ’ క్లాస్ సభ్యులుగా ఉండి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలలో ప్రధాన పాత్ర పోషించే కంపెనీల చేతుల్లోకి సామూహిక వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వెళ్లే ప్రమాదం ఉంది. బహుళ ప్రయోజన సహకార సంఘాలు నిర్వహించే మొత్తం వ్యాపార ప్రయోజనం, ఆర్థికంగా బలంగా ఉండే ధనిక రైతులకు, కార్యకలాపాల అధిపతులకు దక్కుతుంది.
బహుళ ప్రయోజన సహకార సంఘం తన పరిధిలోని సభ్యులు, సభ్యులు కాని వారి సామాజిక, ఆర్థిక, వ్యాపార సంబంధిత సమాచారాన్ని సేకరిస్తుంది. విధానాల రూపకల్పనకు, వ్యవసాయం లేదా దాని సంబంధిత వ్యాపారం లేదా అభివృద్ధి ప్రణాళికకు ఉపయోగిస్తుంది. ఇంతకుముందు మోడీ ప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ నల్ల చట్టాల్లో ఉన్న రైతు వ్యతిరేక అంశాలు బహుళ ప్రయోజన ప్రాథమిక గ్రామీణ సహకార సంఘాల ద్వారా అమల్లోకి వస్తాయి. ఆధునిక వ్యాపార నిర్వహణకు అవసరమైన విధంగా పి.ఎ.సి.ఎస్‌లు అన్నిటినీ కంప్యూటరీ కరించి ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. ఇక మోడల్ బైలాస్‌ను ఆమోదింపచేసి, వాటి ప్రకారం సంఘాలను నడపటమే తరువాయి. ఇప్పటి వరకు సహకార రంగాన్ని అన్ని పాలక పార్టీలు దివాళా తీయించాయి. విధానాల రూపకల్పన చేసి, రోజువారీ కార్యకలాపాలలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదనే ప్రజాస్వామ్య పద్ధతికి తిలోదకాలిచ్చాయి.
సహకార సంఘాలను ప్రజాస్వామ్య యుతంగా నడిపే పేరుతో పరస్పర సహాయక సహకార సంఘాల చట్టాన్ని తెచ్చి, పాల డెయిరీలను కంపెనీలకు అప్పచెప్పారు. వ్యవసాయ పరపతి సంస్థలు మినహా మిగతా సహకార సంస్థలను ప్రయివేటీకరించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు, డి.సి.సి.బిలు, టిప్కాబ్‌లకు ఎన్నికలు నిర్వహించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ కార్యకర్తలను వ్యవసాయ పరపతిలోని మూడు దొంతరలలో పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆడించినట్లు ఆడుతూ వ్యవసాయ సహకార రంగాన్ని ప్రయివేటీకరిస్తున్నాయి. పి.ఎ.సి.ఎస్‌లు బహుళ ప్రయోజన సహకార సంఘాలుగా మారిన తరువాత, వాటితో పాటు డి.సి.సి.బి లు, టిప్కాబ్ కూడా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో ఉన్న కార్పొరేట్ల చేతుల్లోకి పోతాయి. రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ విధానాలను వ్యతిరేకించి సహకార రంగాన్ని కాపాడుకోవడమే ముందున్న కర్తవ్యం.
మూడ్ శోభన్
9949725951