Sunday, March 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూదాన్‌ భూములపై సమన్వయం అవసరం

భూదాన్‌ భూములపై సమన్వయం అవసరం

- Advertisement -

అర్హులైన పేదలను గుర్తించాలని కలెక్టర్‌ను ఆదేశించాం
వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి అండగా ఉంటాం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘భూదాన్‌ భూముల వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం పట్ల ఆవేశానికి లోనుకాకుండా కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నా. ఈ విషయంలో రాజకీయ ప్రేరేపిత వ్యక్తులపైనా, సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపైనా, యూట్యూబ్‌ జర్నలిస్టులపైనా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. పేదల పట్ల మన నిబద్ధత, మానవీయ కోణం రేపటి నాడు స్పష్టమయ్యాక వాళ్లు కూడా ప్రభుత్వ చర్యను సమర్ధించాల్సిన పరిస్థితి వస్తుంది. భూదాన్‌ భూముల్లో అర్హులైన ప్రతి పేదకూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సారధ్యంలో గూడు ఇచ్చే బాధ్యత నాది. పేదల సంఘం ముసుగులో విలువైన ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేసి, పేదలను అడ్డు పెట్టుకుని సొమ్ము చేసుకుంటుంటే బాధ్యత గల ప్రభుత్వంగా చూస్తూ ఊరుకోదు.
అక్రమార్కుల పై చర్యల విషయంలో ఎంత కఠినంగా ఉంటామో, పేదల విషయంలో అంతే మానవీయంగా ఉంటాం. వారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి గృహప్రవేశం చేయించే బాధ్యతను నేను తీసుకుంటా’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీనిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరేండ్లుగా భూదాన్‌ భూముల్లో కనీస సదుపాయాలు లేని దుర్భర పరిస్థితుల్లో పేదలు బతుకుతున్నారని ఎత్తిచూపారు. దోపిడీదారులు, భూకబ్జాదారుల మాటలకు లోనై ఆందోళన చెందొద్దని ప్రజలకు సూచించారు. పేదల సంఘం పేరుతో భూ దందాను కమ్యూనిస్టు పార్టీలు కూడా ఖండించాయని గుర్తుచేశారు. ‘కలెక్టరేట్‌ పక్కనే ప్రభుత్వ స్థలంలో అమాయక పేదలకు నకిలీ పట్టాలిచ్చి వారితో గుడిసెలు వేయించి పేదల సంఘం పేరుతో లక్షలు రూపాయలు వసూళ్లు చేశారు. చుట్టు పక్కల ప్రయివేటు స్థలాల వారిపై దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంది. దీనిని రాజకీయ దుమారంగా మార్చి పబ్బం గడుపు కోవాలని కొందరు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు న్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టే ప్రభుత్వానికి వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడం భారమా!?’ అని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో పలు కాలనీల్లో వేలాది పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చిన తమకు వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో గుడిసెలు వేసిన వారు భారం కాదని తెలిపారు. బాధ్యత లేని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మాత్రం పేదలను మోసం చేసిన వారిని కాపాడేలా హంగామా చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -