Saturday, February 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్‌ అర్బన్‌ చట్టం

జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్‌ అర్బన్‌ చట్టం

- Advertisement -

ఫ్యూచర్‌ సిటీలో ప్రభుత్వ
కార్యాలయాల పనులు వేగవంతం చేయాలి
ఎంఏయూడీ పరిధిలోకి ఓఆర్‌ఆర్‌ లోపలి రోడ్లు
చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రాధాన్యత
పురపాలకశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఔటర్‌ రింగురోడ్డు పరిధిలోని (కోర్‌ అర్బన్‌) మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్‌ హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) చట్టం స్థానంలో కోర్‌ అర్బన్‌ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమతులు, రుసుమలు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికి ఆ చట్టమే ఆధారంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ పరిధిలో చేపట్టే పనులను తొలుత చేపడతామని సీఎం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. కోర్‌ అర్బన్‌ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారని గుర్తు చేశారు. అందువల్ల ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ తర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇష్టారీతిగా ఎక్కడిపడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కోర్‌ అర్బన్‌ ఏరియాలోని రోడ్ల నిర్మాణం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ఉపాధిహామీ కింద రోడ్ల నిర్మాణం నిర్దేశిత కాలం తర్వాత మళ్లీ వేయడానికి అనుమతులు రావని తెలిపారు. అలాంటి సమయాల్లో సాంకేతికతను వినియోగించాలని కోరారు. రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవిత కాలాన్ని నిర్ణయించాలని సూచించారు. ఆ లోపు దాన్ని తొలగించినా, అక్కడ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని ఆదేశించారు. కోర్‌ అర్బన్‌ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డ్యాష్‌ బోర్డులో కనిపించాలని అన్నారు. సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలన్నారు. కోర్‌ అర్బన్‌ ఏరియాలో ఫుడ్‌ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని నొక్కి చెప్పారు. నగరంలోని అన్ని హోటళ్లలోగల కిచెన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. వాటిపై తరచూ తనిఖీలు చేపట్టడంతోపాటు పర్యవేక్షణ కొనసాగాలన్నారు. ఫుడ్‌ సేఫ్టీకి ఆయా హోటళ్లు తీసుకుంటున్న చర్యలను మదింపు చేసి వారికి రేటింగ్స్‌ ఇవ్వాలని సీఎం సూచించారు. కోర్‌ అర్బన్‌ ఏరియాలో ఫైర్‌ సేఫ్టీకి పెద్ద పీట వేయాలని సీఎం ఆదేశించారు. 50 అంతస్తులకుపైగా భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయని.. అంత ఎత్తులో అగ్ని ప్రమాదాలు జరిగితే, వాటిని అరికట్టేందుకు అవసరమైన అధునాతన సామగ్రి, సాంకేతికతను సమకూర్చుకోవాలని సూచించారు. నగరంలోని సర్కిళ్లలో వాటర్‌ హార్వెస్టింగ్‌ వెల్స్‌ను ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని కోరారు. అదే సమయంలో యూనిఫోల్స్‌ను ఏర్పాటు చేసి వాటిని మల్టీ యుటిలిటీ పోల్స్‌గా ఉపయోగించాలని అన్నారు. కోర్‌ అర్బన్‌ ఏరియా పరిధిలో ఆర్‌ అండ్‌ బీ, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వివిధ యాజమాన్యాల పరిధిలో రోడ్లు ఉండడంతో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని పేర్కొన్నారు. పనుల్లో ఏకరూపత, వేగవంతానికి ఇది తోడ్పడుతుందని సీఎం అన్నారు. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్‌ చేసిన ఎలివేటెడ్‌ కారిడార్ల నమూనాలను ఈ సందర్భంగా అధికారులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యతగల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని.. వాటిని పర్యాటక స్థలాలుగా మార్చాలని సీఎం సూచించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అక్కడ అవసరమైన అనుమతులు వెంటనే తీసుకోవాలని సూచించారు. ఫ్యూచర్‌ సిటీలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలి వేయకుండా వాటి రక్షణతోపాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జల వనరులను పర్యాటక ప్రదేశాలుగా మార్చాలని సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్‌ రాజ్‌, ఎంఏయూడీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాధ్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ ఇ.వి.నరసింహారెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కమిషనర్లు కర్ణన్‌, జి.సృజన, వినరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -