• రెండు ఎకరాల్లో పంట పూర్తిగా ధ్వంసం
• నష్టపరిహారం చెల్లించాలని రైతు వేడుకోలు
పెద్దవంగర -నవతెలంగాణ
విద్యుదాఘాతంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు రైతు ఆశలను బూడిద చేశాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర గ్రామ శివారులో జరిగిన ఘటనలో రెండెకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. దీంతో రైతుకు రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మైదంశెట్టి మురళి 2 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మరో వారం రోజుల్లో అమ్మకాలు చేపట్టాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం తన పొలం సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో మొక్కజొన్న చొప్పకు అంటుకున్నాయి.
దీంతో భారీగా మంటలు వ్యాపించి, రెండెకరాల్లో పంట మొత్తం బూడిద పాలైంది. చుట్టుపక్కల రైతులు ఇచ్చిన సమాచారంతో బాధిత రైతు అక్కడికి వెళ్లి చూసే సరికి పంట మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నోటికాడికి వచ్చే సమయంలో అగ్నిప్రమాదం రూపంలో నష్టం వచ్చిందని రైతు గగ్గోలు పెడుతున్నాడు. ప్రభుత్వం ప్రకృతి విపత్తుల కింద తమకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి రైతు కోరుతున్నాడు.


