Wednesday, May 7, 2025
Homeతాజా వార్తలుజాతీయ రహదారిని దిగ్బంధించిన మొక్కజొన్న రైతులు

జాతీయ రహదారిని దిగ్బంధించిన మొక్కజొన్న రైతులు

- Advertisement -

నవతెలంగాణ-వాజేడు
మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు, మొక్కజొన్న కంపెనీలు ప్రకటించిన పంట నష్టపరిహారం డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై వాజేడు, వెంకటాపురం మండలాల మొక్కజొన్న రైతులు సుమారు 500మంది రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం సీఐ బండారి కుమార్‌, వాజేడు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా వినలేదు. దాంతో పై అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించగా స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధికారులు, రైతు నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు. బుధవారం తానే స్వయంగా వచ్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని, వ్యవసాయ శాఖ మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కోర్స నరసింహమూర్తి మాట్లాడుతూ.. మూడు నెలలుగా మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు మొక్కజొన్న కంపెనీలు నష్టపరిహారం ప్రకటించిన డబ్బులను, రైతులకు చెల్లించకుండా ఆర్గనైజర్లు, పెట్టుబడుల పేరుతో డబ్బులు తగ్గించి ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారని వాపోయారు. వారికి అధికార, ప్రతిపక్ష పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలు ఉండటంతో మొక్కజొన్న పంట నష్ట పరిహారం చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగడం లేదని తెలిపారు. రైతులకు జిల్లా కలెక్టర్‌కు మధ్య పంట నష్ట పరిహారం చెల్లింపుల విషయంలో జరిగిన చర్చల్లో ఆర్గనైజర్లు కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్న విషయం బయట పడిందని అన్నారు. ఆర్గనైజర్లపై సంబంధిత శాఖ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని మొక్క జొన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతులందరిని ఏకం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన నాయకులు పాయం రాంబాబు, ప్రవీణ్‌ పూనం ప్రతాప్‌, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జెజ్జరీ దామోదర్‌ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -