– ఇక ఎంత మాత్రం మహమ్మారి కాదు
– కేసులు పెరిగినా ఆందోళన చెందొద్దంటున్న డాక్టర్లు
– ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు ఇటీవల మన దేశంలోనూ వెలుగు చూస్తున్నాయి. దీంతో మరోసారి కోవిడ్ మహమ్మారిగా మారుతుందా? లాక్‌డౌన్ పెడతారా? పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కోవిడ్ వచ్చిన సమయంలో ఎక్కువగా దీర్ఘకాలిక రోగాలు కలిగిన వారిపై ప్రభావం చూపించింది. మరణించిన వారిలో కూడా కరోనాతో పాటు ఇతర రోగాలున్న వారే ఎక్కువ. దశల వారీగా కరోనా రకరకాల వేరియంట్ల రూపంలో కొంత కాలం ఆగుతూ మళ్లీ కొత్త వేరియంట్ల రూపంలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు సోకడంతో తెలంగాణలోనూ కరోనాపై ఆందోళన మొదలైంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు ఉండటంతో అన్నిరకాల పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
కోవిడ్ మొదటి వేవ్ 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు కొనసాగింది. రెండో వేవ్ 2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, కరోనా వేవ్స్ కూడా ఆగిపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఆరోగ్యపరంగానే కాకుండా ప్రజల జీవనోపాధితో పాటు మానసికంగానూ కరోనా వేవ్స్ దెబ్బతీశాయి. దేశంలో మళ్లీ కరోనా కేసులు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. మరోవైపు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులు, ఎపిడమాలిస్టులతో ప్రత్యేకంగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు.
కరోనా మరోసారి మహమ్మారిగా మారే పరిస్థితి ఎంత మాత్రం లేదని వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కోవిడ్ ఎండమిక్‌గా మారిపోయిందని చెబుతున్నారు. కొన్ని సీజన్‌లో కొన్ని ప్రాంతాల్లో కొంత ప్రభావం చూపించే ఇతర వైరల్ ఫీవర్ల మాదిరిగానే కరోనా ఒకటని స్పష్టం చేస్తున్నారు. అయితే కార్పొరేట్, మెడికల్ మాఫియా మాత్రం మరోసారి కరోనా పేరుతో దోపిడీకి కాచుకుని కూర్చుంది. ఎవరైనా సరే కరోనా పేరుతో దోపిడీకి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వైద్యారోగ్యశాఖ మంత్రి హెచ్చరించారు.
భయం వద్దు.. జాగ్రత్తలు తీసుకుంటే సరి
కోవిడ్-19 విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గాంధీ ఆస్పత్రి క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ కిరణ్ మాదాల తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను కాకుండా అధికారిక సమాచారాన్ని విశ్లేషించుకోవాలని సూచించారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న వేరియంట్లతో ప్రాణాపాయం లేదన్నారు. అయితే 60 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు, గర్భిణులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారం రోజులు ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు తగ్గకుంటే సమీపంలోని డాక్టర్‌ను సంప్రదించాలని కోరారు.
– డాక్టర్ కిరణ్ మాదాల
సింపుల్ ట్రీట్ మెంట్‌తో నయం
కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ వసంత్ కుమార్ తెలిపారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో కరోనా బారిన పడిన వారికి చికిత్స చేయొచ్చని చెప్పారు. ఇందుకోసం కేవలం రూ.45 ఖరీదైన మందులు వాడితే సరిపోతుందని తెలిపారు. నాలుగు రోజుల తర్వాత నెగెటివ్ అవుతారని తెలిపారు. కరోనా మళ్లీ వచ్చిందనీ, ఏదో జరిగిపోతుందనే ప్రచారం మెడికల్ మాఫీయాకు, కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పారు. కరోనా మళ్లీ రాలేదనీ, గతంలో వచ్చిన కరోనా పూర్తిగా కనుమరుగు కాలేదని చెప్పారు. రెగ్యులర్ టెస్టులు చేయకపోవడం వల్లే అది కనుమరుగైందనే భావన నెలకొందన్నారు. కేరళలో అక్కడి ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా రెగ్యులర్ టెస్టులు చేస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నదనీ, వాస్తవ సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నదని తెలిపారు. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలోనూ రావాలని ఆకాంక్షించారు.
– డాక్టర్ వసంత్ కుమార్
మళ్లీ కరోనా…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES