– తెలంగాణ సాయుధ పోరాటం.. ఓ సందేశం
– లౌకిక, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కీలకం
– సీపీఐ జాతీయ సెమినార్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
– ‘నవతెలంగాణ’ పుస్తక ప్రదర్శన స్టాల్ సందర్శన
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల చేతిలో బందీగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ శక్తులు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. మతాన్ని అడ్డుపెట్టుకుని లబ్ది పొందేందుకు కార్పొరేట్, ఫాసిస్టుశక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘నేటి భారతదేశం- వామ పక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన సెమినార్‌లో భట్టి విక్రమార్క ప్రసంగించారు. పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నేతృత్వంలోని మతతత్వ శక్తులు నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. ఆర్థిక, సామాజిక అంశాలను పక్కదారి పట్టిస్తున్నాయని తెలిపారు. లౌకిక, ప్రజాతంత్ర శక్తుల ఐక్యతతోనే మతతత్వశక్తులను అడ్డుకోగలమని స్పష్టం చేశారు. దేశంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాలు ఐక్యంగా కదలాలని తెలిపారు. మార్క్స్ చెప్పినట్టుగా వర్గ పోరాటాల ద్వారానే సమసమాజం నిర్మితమవుతుందని అన్నారు. భారతదేశంలో ప్రస్తుతం పార్లమెంటు వ్యవస్థ ప్రశ్నార్థకమైందని తెలిపారు. ఒక పక్క ఫాసిస్టు వ్యవస్థ, మరోపక్క కార్పొరేట్లు ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా అనేక భావ జాలాలకు నిలయంగా ఉందని, ఆతిథ్యం అందిం చడంలో ఖమ్మం ముందు వరుసలో ఉంటుందని వ్యాఖ్యానించారు. వామపక్షాలకు బలమైన కేంద్రం ఖమ్మంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం, వామపక్ష జాతీయ నేతలు హాజరుకావడం సంతోషకరమన్నారు. వందేండ్ల సీపీఐ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయని తెలిపారు. ఈ దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో వామపక్షాలు ప్రముఖ భూమిక పోషించాయని తెలిపారు. 1947లో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని అన్నారు. నిజాం రాజును కూల్చడానికి కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచి పోయిందన్నారు. తెలంగాణలో భూమి కోసం- భుక్తి కోసం- పేదల విముక్తి కోసం పోరాడటంతో పాటు దున్నేవానికే భూమి దక్కాలని కమ్యూనిస్టులు పోరాడారని తెలిపారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఏ ఇంటి తలుపు తట్టినా ఒక వీరగాధ వినిపిస్తుందన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ కౌలుదారీ చట్టాన్ని, భూ సంస్కరణ చట్టాన్ని, 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని, బ్యాంకుల జాతీయీకరణతో పాటు ఇటీవల కాలంలో సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ దేశంలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి సుదీర్ఘకాలం పయనించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా వందేండ్ల సీపీఐ సీడీని భట్టి ఆవిష్కరించారు.
‘నవతెలంగాణ’ పుస్తక ప్రదర్శన స్టాల్ సందర్శన
ఎస్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సెమినార్‌కు హాజరయ్యేందుకు వచ్చిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ‘నవతెలంగాణ’ పుస్తక ప్రదర్శన స్టాల్‌ను సందర్శించారు. పుస్తకాలను పరి శీలించి వామపక్ష భావజాల వ్యాప్తికి దోహదపడే అనేక పుస్తకాలను తీసుకు వస్తున్న నవతెలంగాణను అభినందిం చారు. ‘నవతెలంగాణ’ బుకహేౌస్ మేనేజర్ వరలక్ష్మి, ఉప ముఖ్యమంత్రి ఎంచుకున్న సీతారాం ఏచూరి ‘ఓ సోషలిస్ట్ ఆచరణ పథం’ పుస్తకాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధి కె.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.



