– నేను విద్యాశాఖ మంత్రి అయితే ఆ స్కూళ్లను మూసేస్తా..
– సరైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
– కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభం
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా అర్హత లేని సిబ్బందితో బట్టీ చదువులు చెబుతూ.. పేదలను దోచుకుంటున్నాయని, తాను విద్యాశాఖ మంత్రి అయితే రాష్ట్రంలో అలాంటి స్కూళ్లను మూసేస్తానని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలు కలిగిన ఉపాధ్యాయలచే నాణ్యమైన బోధన సాగుతోందని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బొట్టుగూడ పాఠశాల భవన నిర్మాణం తన చిరకాల కోరిక అని, పేదవాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. 2500 గజాల స్థలంలో అత్యాధునిక వసతులతో భవనాలు నిర్మించామని చెప్పారు. సంప్రదాయ విద్య కాకుండా అన్ని రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. పాత సిలబస్‌తో పాటు, సీబీఎస్‌ఈ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ పేదలను దోచుకుంటున్నాయని, తాను విద్యాశాఖ మంత్రిని అయితే అలాంటి స్కూల్స్ అన్నింటినీ మూసేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. సరైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని చెప్పారు. కుల మతాలకు అతీతంగా విద్యార్థులు చదువుకోవాలన్నది తమ ప్రభుత్వ ఆశయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటేనే పోటీ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్, ఆర్‌డిఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, ప్రతీక ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు.
పేదలను దోచుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



