ఏడాదిన్నరకు పైగానే గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతున్నది. ఇప్పటివరకు 85 వేల టన్నుల బాంబులతో ఆ ప్రాంతాన్ని శిథిలాల కుప్పగా మార్చింది. 18 నెలల కాలంలో గాజాపై ఇజ్రాయిల్ జారవిడిచిన బాంబులు హిరోషిమాపై వేసిన అణుబాంబు శక్తి కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 56 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. లక్షలాది మందికి క్షతగాత్రులయ్యారు. గాజా జనాభాలో సగం మంది నిర్వాసితులయ్యారు. వెస్ట్ బ్యాంక్‌లో కూడా వెయ్యి మంది పాలస్తీనియన్లు మరణించారు. అక్రమ సెటిల్ మెంట్ కార్యకలాపాలు, హింస పెరిగాయి. ఈ చర్యలను ఇప్పటికే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ఆక్షేపించింది. దీన్ని జెనోసైడ్‌గా నిర్ధారించేందుకు అన్ని ఆధారాలున్నాయని చెప్పింది. అయితే ఈ మరణ మృదంగానికి, యుద్ధం దీర్ఘకాలం కొనసాగడానికి కారణాలను చెబుతూ ‘ఫ్రం ఎకానమీ ఆఫ్ ఆక్యుపేషన్ టు ఎకానమీ ఆఫ్ జెనోసైడ్’ పేరిట యూఎన్ స్పెషల్ రిపోర్టర్ ఫ్రాన్సె స్కా అల్బనీస్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించింది.
లాభాల కోసం కార్పొరేట్ కంపెనీలు చేసే దురాగతాలను మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబీఎం వంటి ప్రసిద్ధ కంపెనీలు తమ ప్రయోజనాల కోసం గాజాలో జెనోసైడ్ కొనసాగేలా మద్దతుగా నిలుస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ సంస్థలు జెనోసైడ్, ఆక్యుపేషన్‌లో పాల్గొంటూ అంతర్జా తీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.
గాజా సంఘర్షణలో 48కి పైగా కార్పొరేట్ సంస్థలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంటున్నట్లు ‘ఫ్రం ఎకానమీ ఆఫ్ ఆక్యుపేషన్ టు ఎకానమీ ఆఫ్ జెనోసైడ్’ నివేదిక తెలిపింది. ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబీఎం, పాలంటిర్ టెక్నాలజీస్, లాక్‌హీడ్ మార్టిన్, ఎల్బిట్ సిస్టమ్స్, ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండిస్టీస్ వంటి సంస్థలు ఉండడం గమనార్హం. ఈ నివేదిక ప్రకారం 2023 నుంచి టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్‌చేంజ్ 213 శాతం పెరిగి, 225.7 బిలియన్ డాలర్ల మార్కెట్ లాభాలను సాధించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐకు డిమాండ్ పెరగడంతో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు లాభాలు పొందుతున్నాయి. 2023 నుండి ఇజ్రాయిల్ సైనిక వ్యయం 65శాతం పెరిగి 46.5 బిలియన్ డాలర్లకు చేరడంతో ఆయుధ సంస్థలు సైతం లాభాల్లో నడుస్తున్నాయి. ఇజ్రాయిల్ సైన్యం గాజాలో నిఘా, టార్గెటింగ్ కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవలను వినియోగిస్తున్నది. 2023 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు, అజూర్ ఏఐ సేవల వినియోగం 64 రెట్లు, స్టోరేజ్ సేవలు 60 శాతం పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది. దీంతో 2025 మొదటి త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ 70 బిలియన్ డాలర్ల ఆదాయంతో 18 శాతం లాభాల పెరుగుదలను నమోదు చేసిందని ఫ్రాన్సెస్కా అల్బనీస్ నివేదిక పేర్కొంది. ఇజ్రాయిల్ ప్రభుత్వానికి క్లౌడ్ సేవలు అందిస్తున్న గూగుల్ క్లౌడ్ 2024 చివరి త్రైమాసికంలో 12 బిలియన్ డాలర్ల ఆదాయంతో 30 శాతం పెరుగుదలను, అమెజాన్ వెబ్ సర్వీసెస్ 28 బిలియన్ డాలర్ల ఆదాయంతో 19 శాతం పెరుగుదలను సాధించాయని నివేదికలో పొందుపరిచింది. పాలంటీర్ టెక్నాలజీస్, ఐబీఎం వంటి కంపెనీలు సైతం వివిధ సేవలు అందిస్తూ లాభాలను ఆర్జిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఎల్బిట్ సిస్టమ్స్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండిస్టీస్ యుద్ధం కోసం ఇజ్రాయిల్‌కు డ్రోన్లు, ఆయుధాలను సరఫరా చేస్తూ గణనీయమైన లాభాలు ఆర్జిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎల్బిట్ సిస్టమ్స్ లాభాలు 18.7 శాతం పెరిగాయి. ఎఫ్-35 ఫైటర్ జెట్లను సరఫరా చేసే లాక్‌హీడ్ మార్టిన్ సైతం లాభాల్లో ఉన్నది. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్ ఇళ్లు, మసీదులు, ఇతర మౌలిక సదుపాయాలను కూల్చి వేయడానికి క్యాటర్ పిల్లర్, వోల్వో వంటి కంపెనీలు భారీ యంత్రాలను సరఫరా చేస్తున్నాయి. బ్లాక్‌రాక్, వాన్‌గార్డ్ వంటి సంస్థలు.. మైక్రోసాఫ్ట్, అమెజాన్, పాలంటిర్, లాక్‌హీడ్ మార్టిన్‌లలో పెట్టుబడులు పెడుతూ ఈ విధ్వంసంలో పరోక్షంగా పాల్గొంటు న్నాయి. ఈ నివేదికను ఇజ్రాయిల్, అమెరికా తిరస్కరించాయి. ఫ్రాన్సెస్కా అల్బనీస్‌ను తొలగిం చాలని యూఎస్ సెక్రెటరీ జనరల్‌ను కోరాయి. అయితే ఇజ్రాయిల్‌తో వ్యాపార సంబంధాలను నిలిపి వేయాలని కార్పొరేట్ కంపెనీలకు ఫ్రాన్సెస్కా అల్బనీస్ సూచించారు. బీడీఎస్ (బైకాట్, డివెస్ట్ మెంట్, శాంక్షన్స్) ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు ఆయా కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరిం చాలని ఆమె పిలుపునిచ్చారు.
– మహమ్మద్ ఆరిఫ్, 7013147990