Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజూన్‌ తర్వాతే కార్పొరేషన్‌ పదవులు..

జూన్‌ తర్వాతే కార్పొరేషన్‌ పదవులు..

- Advertisement -

అప్పటికి పాతవారి కాలపరిమితి ముగింపు
ఖాళీ అయ్యేవి.. ఖాళీగా ఉన్నవి అప్పుడే భర్తీ చేద్దాం : సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అధికార పార్టీలో ఆశావహులు ఎదురు చూస్తున్న కార్పొరేషన్‌ చైర్మెన్‌, పాలక మండలి సభ్యుల పోస్టుల భర్తీ… రెండడగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అధిష్టానంతో సంప్రదింపులు, సమాలోచనలు చేయటం, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి జాబితాలు రెడీ చేయటం.. ఆ తర్వాత వాటిని పక్కకు పెట్టటం షరా మామూలైపోయిందనే వాదనలు వినబడుతున్నాయి. దీంతో పదవులపై గంపెడాశలు పెట్టుకున్న జిల్లా, రాష్ట్ర స్థాయి నేతల్లో నైరాశ్యం నెలకొంది. ‘పదేండ్లపాటు పార్టీ అధికారానికి దూరంగా ఉన్న సమయంలో ఎటూవెళ్లకుండా అంటిపెట్టుకునే ఉన్నాం.. బీఆర్‌ఎస్‌ ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగకుండా కాంగ్రెస్‌ జెండాను వదలకుండా పట్టుకున్నాం.. అందరి కృషి వల్ల మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండున్నరేండ్లయినా మమ్మల్ని గుర్తించకపోతే ఎలా…?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహులు గాంధీ భవన్‌ చుట్టూ చక్కర్లు కొడుతుండటంతో ఇప్పుడు మళ్లీ కార్పొరేషన్‌ పదవుల భర్తీ అంశం చర్చకొచ్చింది.

అయితే ఆయా పదవులను ఇప్పటికిప్పుడే కాకుండా జూన్‌ తర్వాతే భర్తీ చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జులైలో పలు కార్పొరేషన్లకు చైర్మెన్లను నియమించారు. వారందరూ అదే నెలలో బాధ్యతలను స్వీకరించారు. ఆ చొప్పున వారి పదవీ కాలం (రెండేండ్లు) మరో రెణ్నెల్లలో పూర్తవుతుంది. దాంతో దాదాపు 40 నుంచి 50 కార్పొరేషన్ల పదవులు ఖాళీ కానున్నాయి. ఇవిగాకుండా మరో 50 కార్పొరేషన్ల చైర్మెన్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటన్నింటినీ కలిపి జులైలో భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. అలాగైతే మొత్తం 150 నుంచి 200 మంది దాకా పదవులివ్వొచ్చన్నది (కార్పొరేషన్‌ చైర్మెన్‌ పోస్టులు, సభ్యులు కలిపి) ఆయన వ్యూహంగా కనబడుతున్నది. ఆ తర్వాత నిర్వహించబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలకు వారందర్నీ రంగంలోకి దించాలని సీఎం భావిస్తున్నారు. ఈ ప్లాన్‌కు సక్సెస్‌ఫుల్‌గా అమలు చేయగలిగితే వారితో మరింత ఉత్సాహంగా పని చేయించుకోవచ్చని ఆయన భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -