Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeచైల్డ్ హుడ్దిద్దుబాటు

దిద్దుబాటు

- Advertisement -

సింగరాజుపల్లె పాఠశాలలో శశాంక్‌, రఘువంశి ఏడవ తరగతి చదువుతున్నారు. శశాంక్‌ తెలివైన కుర్రవాడు. రోజు వారి పాఠాలు శ్రద్ధగా చదువుతూ, తరగతిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. రఘువంశి కూడా తెలివైన వాడే.కానీ చదువు మీద అశ్రద్ధ ఎక్కువ.కొడుకు చదువులో వెనుకబడిన విషయం టీచర్ల ద్వారా తెలుసుకుని రఘును మందలించాడు రామయ్య.
ఆరోజు మొదటి యూనిట్‌ పరీక్షల ప్రోగ్రెస్‌ కార్డు ఇచ్చారు.ఆదుర్దాగా తన మార్కులు చూసుకున్న శశాంక్‌, మంచి మార్కులు వచ్చాయని సంతోషించాడు.ఇంతలో రఘువంశి క్లాస్‌ ఫస్ట్‌ అని మాస్టారు ప్రకటించగా,పిల్లలు చప్పట్లు చరిచారు. శశాంక్‌ ముఖం వివర్ణమయింది.
‘జులాయిగా తిరిగే రఘువంశికి,ఇన్ని మార్కులు ఎలా వచ్చాయి?మాస్టారడిగిన ప్రశ్నలకు బిక్కమొహం వేస్తాడు.తనకు క్లాస్‌ ఫస్ట్‌ అంటే ఆశ్చర్యమేస్తుంది!’ మనసులోనే అనుకున్నాడు శశాంక్‌.
తనకు వచ్చిన మార్కులు తండ్రి విశ్వేశంతో చెబుతూ, ‘తరగతిలో అందరికంటే రఘువంశికే ఎక్కువ మార్కులు వచ్చాయని, పుస్తకమే ముట్టని వాడికి అన్ని మార్కులు ఎలా వచ్చాయో అర్థంకాలేదన్నాడు’ శశాంక్‌.
”అదేముంది!వాడు కష్టపడి చదివి తెచ్చుకున్నాడు. కొందరు పిల్లలు పైకి సోమరిగా కనిపించినా, లోలోపల శ్రద్ధగా చదివి రఘు లాగా ప్రతిభను చూపిస్తారు.వచ్చే పరీక్షల్లో నీవు శ్రద్దగా చదివితే,క్లాస్‌ ఫస్ట్‌ రాగలవని ” కొడుకుని ప్రోత్సహించాడు.తండ్రి సలహాతో మొదటి టర్మ్‌ పరీక్షలే లక్ష్యంగా శశాంక్‌ చదివాడు.పరీక్షలన్నీ బాగా వ్రాసిన తనకు మంచి స్కోర్‌ వస్తుందనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.
ఆరోజు శశాంక్‌ ఆట మైదానంలో వుండగా, తోటి విద్యార్ధి వినోద్‌ కలిసి, ‘ఎవరికీ చెప్పనంటే,తనకో విషయం చెబుతానన్నాడు. ‘చెప్పమన్నాడు ‘శశాంక్‌.
రఘువంశి పరీక్షల్లో కాపీ కొట్టాడని,వాడి పక్క బెంచీలో పరీక్ష రాస్తున్న తను అది గమనించానని అన్నాడు వినోద్‌.’మాస్టారుకు చెప్పాల్సిందని’ నిలదీశాడు శశాంక్‌. అలా చెబితే ఇద్దరి మధ్య స్నేహం చెడుతుందని,తనపై కోపం పెంచుకుంటాడని’ అన్నాడు వినోద్‌.
”మనం కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే, వాడేమో కాపీలుకొట్టి క్లాస్‌ టాపర్‌ అవుతున్నాడు.ఇది బాగలేదు.వాడు తప్పు చేస్తున్నాడని మాస్టారికి చెబితే మందలిస్తాడు.’ ఆవేశంగా అన్నాడు శశాంక్‌.
”ఇది ఇంతటితో వదిలేద్దామని,తనకు చెప్పాలనిపించి చెప్పానన్నాడు’ వినోద్‌.
టర్మ్‌ పరీక్షలలో శశాంక్‌ ద్వితీయ స్థానంలో నిలువగా, రఘువంశి తిరిగి మొదటి స్థానంలో నిలిచాడు. ‘చదువులో చురుకుగా ఉండని రఘుకు ఇది ఎలా సాధ్యమని’ ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తనకు మొదటి స్థానం వచ్చిందని రఘువంశిలో ఒకింత గర్వం.తను చేస్తున్నది తప్పని తెలుసుకోలేని స్థితి..
‘కాపీలు కొట్టి ర్యాంక్‌ లు తెచ్చుకోవడం గొప్ప కాదని, అది మనసుకు ఆనందం ఇవ్వదని, కష్టపడి చదివి తెచ్చుకున్న మార్కుల్లో వుండే తప్తి అందులో వుండదని ‘ రఘును సున్నితంగా నిలదీశాడు శశాంక్‌.
బదులుగా, ‘తాను కాపీలు కొట్టి పరీక్షలు వ్రాసినట్లు ఎవరు చెప్పారని,తెలియకుండా మాట్లాడ వద్దని’ కోపపడ్డాడు రఘువంశి.
ఆ విషయం తాను చూడక పోయినా, స్నేహితులకు తెలుసని, తన మేలు కోరి చెబుతున్నానని,అలాంటి పద్ధతులు మానుకోవాలని’ అన్నాడు శశాంక్‌.తన తప్పును ఎత్తి చూపించిన శశాంక్‌తో మాటలు నిలిపివేశాడు రఘువంశి.
‘వినోద్‌ మాటలు విని రఘును అపార్థం చేసుకున్నానేమో! వాడు అలా అసత్యం చెప్పేవాడు కాదని, నెమ్మదిగా అయినా నిజం బయట పడుతుందని’ మనసుకు సమాధానం చెప్పుకున్నాడు శశాంక్‌.
ఈ మారు యూనిట్‌ టెస్ట్‌ లో, రఘువంశి కాపీ కొడుతుండగా మాస్టారు చేతిలో పట్టుబడ్డాడు. అతనిని మాస్టారు మందలించి,విషయం రఘువంశి తండ్రి రామయ్యకు తెలియచేశాడు.కొడుకు నిర్వాకం తెలిసి రామయ్య కుంగిపోయాడు. విశ్వేశంను కలవాలని కొడుకును వెంటబెట్టుకుని శశాంక్‌ ఇంటికి వెళ్ళాడు.కొడుకును గురించి విశ్వేశంతో చెప్పి చాలా బాధపడ్డాడు రామయ్య.శశాంక్‌ ద్వారా తనకు అన్ని విషయాలు తెలుసని, బాబుకు తాను సర్ది చెబుతానని రామయ్యని ఓదార్చాడు విశ్వేశం.
రఘుని పిలిచాడు విశ్వేశం,”తాను కాపీలు కొట్టిన విషయం ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఒక నిజాన్ని అందమైన అబద్ధంతో కొంత కాలమే దాచగలవు. కానీ అది ఏదో రోజు బయట పడగలదు.మీ మాష్టారి చేతిలో ఇప్పుడు నీవు దొరికి పోయావు.సాటి విద్యార్థుల మధ్య భంగ పడ్డావు.తరగతులు పెరిగే కొద్దీ కష్టపడి చదవాలి. కాపీల మీద ఆధారపడితే చివరికి నీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. దానివల్ల కన్నవారికి, ఊరికి చెడ్డపేరు వస్తుంది. ఊళ్ళో కూడా అందరూ నిన్ను చులకనగా చూస్తారు. ముందు ముందు ఇలాంటి తప్పులు చేయకుండా వుండాలి.సరేనా ”భుజం మీద చేయి వేసి బుద్ధి మాటలు చెప్పాడు విశ్వేశం. తన తప్పును తెలుసుకున్న రఘువంశి, శశాంక్‌ తో చేతులు కలిపాడు…
– కరణం హనుమంతరావు, 6300043818

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad