– అనర్హులకు అదనపు చెల్లింపులు
– 11శాతం మందికే పునరావాసం
– రూ.1660 కోట్ల మట్టి దొంగలపాలు
– కాంట్రాక్టు సంస్థలకు వడ్డీలేకుండా రూ.475 కోట్లు
– కాగ్ నివేదికలో సంచలన విషయాలు
అమరావతి : ‘రాష్ట్రానికి ప్రాణావాయువుగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు పెద్దఎత్తున చోటు చేసుకున్నాయి. అనర్హులకు వందల కోట్ల రూపాయలు పరిహారం రూపంలో చెల్లించారు. కాంట్రాక్టు సంస్థలకు రూ.475 కోట్లను వడ్డీలేకుండా అప్పనంగా ఇచ్చేశారు. నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తిచేయకపోవడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది. నిజమైన గిరిజన నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు గిరిజనేతరులను లబ్దిదారులుగా చూపించి వారికి చెల్లింపులు చేశారు.పోలవరం ప్రాజెక్టుపై కాగ్ పేర్కొన్న అంశాలివి. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో పలు సంచలన విషయాలు చోటుచేసుకున్నాయి. . జవాబుదారీతనంలేదని, ఎత్తిపోతల పథకాలకు అనుమతులు తీసుకోలేదని కాగ్ పేర్కొంది. 2018 నుండి 2023 వరకూ జరిగిన పనులను పరిశీలిస్తే నిర్మాణంపైనే దృష్టిపెట్టడం ద్వారా భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ కార్యకలాపాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించింది. పర్యావరణ అనుమతులకు సంబంధించి చత్తీస్‌ఘర్, ఒడిశా, తెలంగాణా రాష్ట్రాలు సుప్రీం కోర్టులో కేసులు వేశాయని, అవి ఇంకా కొలిక్కిరాలేదని, ఫలితంగా రక్షణ గోడల నిర్మాణం చేపట్టలేదని నివేదికలో వెల్లడించింది. నివాసిత గ్రామాలను గుర్తించే కాంటూరు లెక్కల్లోనూ తప్పులు ఉన్నాయని, సర్వే నివేదికలు ఇవ్వకపోవడం వల్ల 41.15 కంటే దిగువన ఉన్న గ్రామాలను నిర్థారించడం సాధ్యం కాలేదని తెలిపింది.
ముంపు కుటుంబాల లెక్కల్లో తప్పులు
భూఅవసరాలు, ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి డిపిఆర్‌లో చూపించిన లెక్కలకు సవరించిన వ్యయ అంచనాలకు మధ్య భూమి లెక్కల్లో తేడాలున్నాయని నివేదికలో గుర్తిం చారు. మునిగిపోతున్న గ్రామాలు, పునరావాసం కల్పించాల్సిన ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల సంఖ్యలో తప్పులున్నాయని పేర్కొంది. సేకరిం చాల్సిన ప్రభుత్వ భూమిలో 14,274 ఎకరాలు, అటవీ భూమిలో 492.33 ఎకరాల తగ్గుదల చూపించారని పేర్కొన్నారు. అదే సమయంలో అసైన్డ్ ఆక్రమణలకు గురైన భూమి సున్నా నుండి 12,371 ఎకరాలకు, పట్టాభూమి 47,121 ఎకరాలకు పెరిగిందని, దీనివల్ల పరిహారం రూపంలో ప్రభుత్వంపై అదనపు భారం పడిందని తెలిపింది.
పునరావాసం 11 శాతం మందికే
ప్రాజెక్టులో గుర్తించిన 1,06,006 మంది నిర్వా సితులకు పునరావాసం కల్పించాల్సి ఉందని, 2014 మార్చి నాటికి 0.67 శాతం మందికి పునరావాసం కల్పించారని, 2023 మార్చి చివరి నాటికి 11 శాతం కుటుంబాలను మాత్రమే కాలనీలకు తరలించాలని తెలిపింది. ప్రతిపాదించిన 213 కాలనీలకు గాను 138 కాలనీల పనులు ప్రారంభించలేదని తెలిపింది. అలాగే నిర్మాణంలో ఉన్న 49 కాలనీల్లో 13,938 యూనిట్లలో 11,507 నిర్మాణాలు పూర్తయ్యాయని, 6,216 కుటుంబాలను మాత్రమే తరలించారని పేర్కొన్నారు. అలాగే కనీస సౌకర్యాలు లేక చాలా వరకూ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కట్టిన ఇళ్లలోనూ గోడలకు పగుళ్లు, చెమ్మదిగడం, గచ్చు పాడవటం వంటి సమస్యలు వచ్చాయని తెలిపింది. అర్హత ఉన్నప్పటికీ 36 శాతం ప్రాజెక్టు నిర్వాసితకుటుంబాలకు భూమికి భూమి ఇవ్వలేదని, 95 శాతం షెడ్యూలు కులాలు, తెగల యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వలేదని తెలిపారు.
పోలవరంలో అవినీతి, అక్రమాలు
- Advertisement -
- Advertisement -



