Tuesday, October 14, 2025
E-PAPER
Homeజాతీయంలాలూ కుటుంబంపై అవినీతి కేసు

లాలూ కుటుంబంపై అవినీతి కేసు

- Advertisement -

ఢిల్లీ కోర్టులో అభియోగాలు నమోదు
న్యూఢిల్లీ :
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి కేసు ముందుకొచ్చింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే శాఖా మంత్రిగా ఉన్న సమయంలో రాంచీ, పూరీలోని రెండు ఐఆర్‌సిటిసి హోటళ్ల టెండర్లలో అవినీతి జరిగిందని పేర్కొంటూ లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌తోపాటు పలువురిపై మోసం, నేరపూరిత కుట్ర నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (సిబి) అభియోగాలు మోపారు. ఈ కేసులో వారు ముగ్గురూ కోర్టు ముందు సోమవారం హాజర య్యారు. ఈ కేసులో 14 మంది నిందితులపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు న్నాయని కోర్టు పేర్కొంది. తాము నిర్దోషులమని, విచారణను ఎదుర్కొంటానని లాలూ ప్రసాద్‌తో పాటు రబ్రీదేవి, తేజస్వి స్పష్టం చేశారు.

మాపై అభియోగాలు.. రాజకీయ ప్రతీకారం : తేజస్వి యాదవ్‌
రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే ఐఆర్‌సిటిసి హోటల్‌ అవినీతి కేసులో తమపై అభియోగాలు మోపినట్లు తేజస్వి యాదవ్‌ చెప్పారు. ఈ కేసుపై పోరాటం కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రాజ్యాంగానికి వ్యతిరేకమైన బీజేపీ అధికారంలో ఉన్నంత వరకూ, నేను బతికి ఉన్నంత వరకూ పోరాడుతూనే ఉంటా. సవాళ్లను ఎదుర్కోవడంలోనే ఆనందం ఉంటుంది. మేం పోరాట మార్గాన్ని ఎన్నుకున్నాం. ఆ మార్గంలోనే గమ్యాన్ని కచ్ఛితంగా చేరుకుంటాం’ అని స్పష్టం చేశారు. ‘ఇది రాజకీయ ప్రతీకారం. బీహార్‌ ప్రజలకు, దేశ ప్రజలకు నిజమేంటో తెలుసు. త్వరలో బీహార్‌ ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుంది. కోర్టు తీర్పును గౌరవిస్తాం. ఈ కేసుపై పోరాడతాం. బీహార్‌ ప్రజలు చాలా తెలివైనవారు. ఏం జరుగుతుందో బీహార్‌ ప్రజలకు తెలుసు. ఇదంతా రాజకీయ కక్షసాధింపుల్లో భాగమే. భారతీయ రైల్వేలకు రూ.90 వేల కోట్ల లాభాలను తెచ్చిన ఘనత లాలూకే దక్కుతుంది. ఆయన ప్రతి బడ్జెట్‌లోనూ ఛార్జీలను తగ్గించారు. ఈ చర్యలతోనే ఆయన చారిత్రాత్మక రైల్వేమంత్రిగా పేరు గాంచారు. హార్వార్డ్‌, ఐఐఎం విద్యార్థులు లాలూజీ నుంచి నేర్చుకోవడానికి వచ్చారు. ఆయనను మేనేజ్‌మెంట్‌ గురువుగా పిలుస్తారు’ అని చెప్పారు. ‘కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒక నెల క్రితం బీహార్‌ వచ్చినప్పుడు… ఎన్నికల్లో పోటీ చేసే స్థితిలో మమ్మల్ని వదిలిపెట్టం అని బెదిరించారు. నేను పోరాడతాను… గెలుస్తాను.. మేము బీహారీలం… నిజమైన బీహారీలు బయటివారికి భయపడరు’ అని ఎక్స్‌లో తేజస్వి యాదవ్‌ పోస్ట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -