Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'అవినీతి' వనరుల కేంద్రం

‘అవినీతి’ వనరుల కేంద్రం

- Advertisement -

మధిర రిసోర్స్‌ సెంటర్‌పై ఆరోపణలు
పుష్కరకాలంగా దారిమళ్లుతున్న నిధులు
మెస్సెంజర్‌ పోస్టులో భార్యను నియమించుకున్న ఎంఈఓ!
ఒక్కరోజూ విధులకు రాకున్నా నెలకు రూ.11,050 చొప్పున డ్రా
కౌన్సిలర్‌గా ఎన్నికైనా ప్రభుత్వ కొలువులోనే…!
50శాతం వేతనంతో కూడిన సరెండర్‌ లీవుల్లోనూ 50:50 దోపిడీ.. నోరుమెదపని విద్యాశాఖ
మండల విద్యాధికారి కరప్షన్‌పౖౖె గళం విప్పుతున్న రిటైర్డ్‌ ఉపాధ్యాయులు

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మధిర మండల వనరుల కేంద్రం అవినీతికి ఆలవాలంగా మారిందా? అంటే ఉపాధ్యాయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. గత 12 ఏండ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న విద్యాశాఖాధికారి వై.ప్రభాకర్‌రావు అవినీతిపై రిటైర్డ్‌ ఉపాధ్యాయులు గళం విప్పుతున్నారు. 2013 నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఈనెలతో పదవీ విరమణ చేస్తున్న సదరు అధికారి.. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మండల వనరుల కేంద్రం కాస్త ‘అవినీతి’ వనరుల కేంద్రంగా మారిందనే విమర్శ ఉంది.

నిరుద్యోగ యువతీ యువకులకు ఇవ్వాల్సిన మెస్సెంజర్‌ పోస్టులో ఏకంగా భార్యనే నియమించుకున్నారని రిటైర్డ్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఆర్‌.లక్ష్మణరావు ఆరోపించారు. 12 ఏండ్ల క్రితం పోస్టులో నియామకం అయినప్పటి నుంచి ఆమె ఏ ఒక్కరోజూ విధులకు హాజరుకాకపోవటం గమనార్హం. కానీ ఆమె పేరుతో ప్రతినెలా ఆ పోస్టుకు సంబంధించిన శాలరీ రూ.11,050 చొప్పున డ్రా అవుతున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. నెలకు రూ.7,500 వేతనం చొప్పున విధుల్లో ఆమె జాయిన్‌ అయ్యారు. నాటి నుంచి పెరుగుతూ ప్రస్తుతం రూ.11,050 చొప్పున ఆమె వేతనం తీసుకుంటున్నారు. ఏ ఒక్కరోజూ విధులకు హాజరుకాని ఆమె సంతకాన్ని ఎవరు చేస్తున్నారనేది ప్రశ్నార్థకం. ఆమె భర్తే సంతకం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

కౌన్సిలర్‌గా ఎన్నికైనా ప్రభుత్వ కొలువులోనే..!
మధిర మండల వనరుల కార్యాలయంలో మెస్సెంజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎంఈవో సతీమణి చారులత విధుల్లో ఉండే… ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి 9వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ గతనెల 27వ తేదీన వెలువడింది. ఫిబ్రవరి 11వ తేదీ ఎన్నికలు జరగ్గా 13వ తేదీన ఫలితాలు వచ్చాయి. 16వ తేదీన ఆమె కౌన్సిలర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన ఆమె జనవరి నెలకు సంబంధించిన శాలరీ మొత్తాన్ని డ్రా చేయటంపై సందేహాలు ఉన్నాయి. కౌన్సిలర్‌గా ఎన్నికైనప్పటికీ ఆమె మెస్సేంజర్‌ పోస్టుకు రాజీనామా చేయనట్లు సమాచారం.

సరెండర్‌ లీవులు… అర్ధవేతన సెలవుల్లోనూ అదే తీరు?
ఉపాధ్యాయులకు సరెండర్‌ లీవులు, అర్ధవేతన సెలవులు, కమ్యూటెడ్‌ సెలవుల మంజూరులోనూ అవినీతి చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎంట్రీలను సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేయకుండా కరప్షన్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. సర్వీస్‌ రిజిస్టర్లు, వేతన బిల్లులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలిస్తే విషయం తేటతెల్లమవుతుంది. తాను హెచ్‌ఎంగా పనిచేసిన సిరిపురం పాఠశాల కాంప్లెక్స్‌, తేళ్ల వసంతయ్య మెమోరియల్‌ (టీవీఎం) హైస్కూల,్‌ మధిర కాంప్లెక్స్‌ పరిధిలోని నిధులను సైతం దుర్వినియోగం చేశారని రిటైర్డ్‌ ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పుడు డిప్యూటేషన్‌ చేసుకోవాలి…కానీ మిగులు సిబ్బంది ఉన్నా డిప్యూటేషన్‌ చేయడంపై అనుమానాలు ఉన్నాయి.

వివిధ రకాల నిధుల దుర్వినియోగం
2013 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఏజీ ఆఫీసు మంజూరు చేసే పీపీవో కాపీలో రిమార్క్స్‌ క్లియరెన్స్‌ చేయకుండానే నాన్‌ డ్రావెల్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌డీసీ/ఎన్‌వోసీ) ఇచ్చి పెన్షన్‌ మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వం రూ.లక్షల్లో నష్టపోతుందని రిటైర్డ్‌ ఉద్యోగవర్గాలు అంటున్నాయి. మండల వనరుల కేంద్రానికి 12 ఏండ్లలో అనేక రూ.లక్షలు మంజూయ్యాయి. తప్పుడు బిల్లుల ద్వారా వాటిని దుర్వినియోగం చేసినట్లు ఎంఈవోపై ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించే టెస్టుల కోసం ఒక్కో ఉపాధ్యాయునికి రూ.450 చొప్పున విడుదల చేస్తారు. కానీ ఆ డబ్బులను టీచర్లకు ఇవ్వకుండా కాజేస్తున్నారనే ఆరోపణలు సైతం ఎంఈవోపౖౖె ఉన్నాయి.

పై అధికారులకు ఫిర్యాదు చేశాం
మధిర మండల విద్యాశాఖ అధికారి ఎం.ప్రభాకర్‌రావు అవినీతి అక్రమాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. వరంగల్‌ ఆర్జేడీతో పాటు ఖమ్మం డీఈవో, జిల్లా అడిషనల్‌ కలెక్టర్లను కలిశాం. 12 ఏండ్లుగా నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై కంప్లైన్ట్‌ ఇచ్చాం. విచారణ చేసి తగుచర్యలు తీసుకోవాలని కోరాం.
-ఆర్‌.లక్ష్మణరావు, రిటైర్డ్‌ స్కూల్‌ అసిస్టెంట్‌, జడ్పీఎస్‌ఎస్‌ దెందుకూరు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -