సీఎం బెదిరింపు రాజకీయాలు : మాజీమంత్రి కేటీఆర్ విమర్శలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో తన స్కాంలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. శనివారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారన్నారు. రేవంత్‌రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయనీ, అలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతిపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే సీఎం, తన అవినీతి సొమ్ము కోసం మూసీ పేరిట రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని ప్రకటించడం దారుణమని తప్పుపట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి, భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందనీ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది ఇండ్లను కూల్చివేయడానికి, దాదాపు 3 వేల ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు మూసీ ఒడ్డున ఉన్న ఇండ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. అవినీతిని తాను ప్రశ్నిస్తే ”శివతాండవం చేస్తాను” అంటూ సీఎం మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రం ”పిచ్చోడి చేతిలో రాయి” లాగా మారిందనీ, అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండున్నరేండ్ల నుంచి మోసం చేస్తున్నారని దుఉయ్యబట్టారు. మూసీ ప్రాజెక్టుపై అసలు ప్రణాళికలు లేకుండా, డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇండ్లు కూల్చకుండా, భూములు స్వాధీనం చేసుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో మూసీ శుద్ధి చేస్తే బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. ఏప్రిల్ మెదటివారంలో మేధావులు, పర్యావరణ నిపుణుల తో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే ఏప్రిల్ 14 వరకు ప్రతీ కాలేజీ, బస్తీలో ప్రచారం చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనీ, లేకపోతే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా వేలాది మందితో వెళ్లి తాళాలు బద్దలుకొట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని హెచ్చరించారు.



