Monday, September 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'కపాస్‌'తో కాటన్‌ బైపాస్‌!

‘కపాస్‌’తో కాటన్‌ బైపాస్‌!

- Advertisement -

సీసీఐ కొనుగోళ్లలో కేంద్రం తిరకాసు
అక్రమాల పేరు చెప్పి యాప్‌ క్రియేషన్‌
స్లాట్‌ బుకింగ్‌ పేరుతో రైతులను దూరం చేసే యత్నం
సాధారణ రైతులు అమ్మటం కష్టమేనని సందేహాలు
ఈ సీజన్‌ నుంచే కొత్త విధానం అమలుకు నిర్ణయం

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. సామాన్య ప్రజానీకాన్ని మరింత ఇబ్బందులపాలు చేసే చర్యలకు పూనుకుంటోంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోళ్లలో ఈ సీజన్‌ నుంచి కపాస్‌ కిసాన్‌ యాప్‌ను ప్రవేశపెడుతోంది. అక్రమాలు, రద్దీ నియంత్రణ పేరుతో అందుబాటులోకి తెస్తున్న ఈ యాప్‌ కారణంగా సాధారణ రైతులు సీసీఐకి విక్రయించటం కష్టమేననే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ యాప్‌ ద్వారా పంట అమ్మాలంటే వారం రోజుల ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్‌ ఆ రోజు అందుబాటులో లేకపోవడమో.. ఏదైనా కారణం చేత విక్రయించలేని పరిస్థితి ఉంటే మరోమారు స్లాట్‌ బుక్‌ చేసుకొని.. వారం పాటు ఎదురుచూడక తప్పదు. అత్యధిక రైతులు పెట్టుబడి పంటగా భావించే పత్తిని సేకరించిన వెంటనే అమ్ముతుంటారు.

వారం రోజులపాటు ఆగే పరిస్థితి ఉండదు.. కాబట్టి ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకునేందుకు మొగ్గుచూపుతారు. తద్వారా సీసీఐ కొంతమేరైనా కొనుగోళ్ల నుంచి తప్పించుకునే అవకాశం లభిస్తుందని పలువురు భావిస్తున్నారు. జిన్నింగ్‌ మిల్లుల వద్ద రద్దీ నెలకొనకుండా.. రైతుల సమయం కూడా ఆదా.. అక్రమాలకూ తావుండదని ప్రవేశపెడుతున్న ఈ మొబైల్‌ యాప్‌తో అక్షరజ్ఞానం పెద్దగా లేని చిన్న సన్నకారు రైతులు సీసీఐ అమ్మకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అత్యధిక రైతులు సీసీఐ కొనుగోళ్లకు దూరమైతే విదేశాల నుంచి దిగుమతులతో కార్పొరేట్లకు మేలు చేయొచ్చని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎత్తుగడగా చర్చ జరుగుతోంది.

రైతులకు ఇబ్బందులే..!
రాష్ట్రంలో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఒక్కో ఎకరానికి సగటున 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుంది. గతేడాది సుమారు 210.19 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ఈ పంటను సాగు చేసిన రైతుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. అత్యధికుల దగ్గర మొబైల్స్‌ ఉండవు.. ఉన్నా స్మార్ట్‌ఫోన్‌లు చాలా అరుదు. ఎక్కువ మందికి యాప్‌ వినియోగం గురించి తెలియదు. అక్టోబర్‌ 1 నుంచి యాప్‌పై అవగాహన కల్పిస్తామని చెబుతున్నా ఎంత మంది రైతులు దీనిపై అవగాహన పెంచుకుని స్లాట్‌ బుక్‌ చేసుకోగలుగుతారనేది సందేహమే. అవగాహన లేని రైతులు ఏఈవోల ద్వారా బుక్‌ చేయించుకోవచ్చని అంటు న్నారు.. కానీ వ్యవసాయ పనుల ఒత్తిడి తీవ్రంగా ఉండే ప్రస్తుత సమయంలో సాధారణ రైతుకు ఇవి సాధ్యమయ్యే పనులు కాదని రైతుసంఘాల మాట.

దూరం భారమే..!
సాధారణంగా రైతులు తమ సమీపంలోని కేంద్రాల్లోనే పంటను అమ్ముకుంటారు. ఈ స్లాట్‌ విధానంతో దూరప్రాంతాల్లోని కేంద్రాలకు కూడా స్లాట్‌ కేటాయించే అవకాశాలు ఉంటాయి. తద్వారా రైతులకు దూరం పెరిగి రవాణా ఖర్చులు భారంగా మారుతాయనే ఆందోళన వ్యక్తమ వుతోంది. ఈ ఇబ్బందులు పడలేక చాలా మంది రైతులు పంటను ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకునే అవకాశా లున్నాయి. కాబట్టి రైతుల కన్నా వ్యాపారులు లబ్దిపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రైతుల నుంచి వ్యతిరేకత
ఈ సీజన్‌ నుంచి పత్తి కొనుగోళ్లలో ప్రవేశపెడుతున్న స్లాట్‌ విధానాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని మార్కెటింగ్‌ శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతా ధికారులకు సైతం నివేదించారు. ఈ నిబంధనను తొలగిం చాలని రిపోర్టు పంపారు. అయినా కేంద్రం మాత్రం ఈ సీజన్‌ నుంచి దీనిని అమలు చేయాల్సిందే అనే పట్టుదలతో ఉంది.

రిజిస్ట్రేషన్‌ ఓ పెద్ద ప్రాసెస్‌
కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ఓ పెద్ద ప్రాసెస్‌గా ఉంది. స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ముందుగా రైతు పేరు, జండర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, క్యాస్ట్‌, అడ్రస్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్లు, అడ్రస్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత ఏ మార్కెట్‌ లేదా సెంటర్‌లో పత్తి అమ్మాలనుకుంటున్నారో వివరాలను యాప్‌లో ఎంటర్‌ చేయాలి. ఫార్మర్‌ టైప్‌ అంటే సొంతమా, కౌలుదారా పేర్కొనాలి. పట్టాదార్‌ పాస్‌బుక్‌ నంబర్‌, సర్వే నంబర్‌, కొలత రకం, రైతుకు ఉన్న భూమి మొత్తం, పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం (దేశీ కాటన్‌, ట్రెడీషనల్‌, హెచ్‌డీపీఎస్‌, క్లోజర్‌ స్పేసింగ్‌, రేర్‌ స్పేసింగ్‌) తదితర వివరాలతోపాటు రైతుకు సంబంధించిన ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌, ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. చదవడానికే చాట భారతమంత ఉన్న ఇవన్నీ సాధారణ రైతు చేయగలడా…? అసాధ్యమని మార్కెటింగ్‌ శాఖ అధికారులే అంటున్నారు. ఈ యాప్‌ ప్రవేశపెట్టడాన్ని అత్యధిక మంది రైతులు వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నా ప్రభుత్వం మొండిగా ప్రవేశపెడుతోందని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -