Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకిసాన్‌ కపాస్‌ పేరుతో పత్తి రైతును దోపిడీ

కిసాన్‌ కపాస్‌ పేరుతో పత్తి రైతును దోపిడీ

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌
నవతెలంగాణ-వలిగొండ రూరల్‌
ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని కిసాన్‌ కపాస్‌ పేరుతో పత్తి రైతును నిలువునా దోచుకునే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలపరిధిలోని పులిగిల్ల గ్రామంలో నిర్వహించిన గ్రామీణ సర్వేలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని నిబంధన విధించడం వల్ల దేశంలో 50 లక్షల మంది రైతులు నష్ట పోతున్నారని చెప్పారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా క్వింటా పత్తికి రూ.8,100 నిర్ణయించగా దళారులు రూ.5,500 నుండి రూ.6,500 వరకు ఇచ్చి దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దళారులను ప్రోత్సహించడం లాంటిదని, వారికి లాభం చేకూర్చే విధంగా ఉందన్నారు. పత్తి రైతులకు నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో జిన్నింగ్‌ మిల్లుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. పులిగిల్ల నుండి కేర్చిపళ్లి వరకు వెళ్లేందుకు గల బీటీరోడ్డు అధ్వానంగా మారి ప్రజలను ఇబ్బందుల గురి చేస్తుందని, వెంటనే బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో పల్లె దవాఖానకు నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, గణపతిరెడ్డి, మాజీ సర్పంచ్‌ కొమ్మిడి లక్ష్మారెడ్డి, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి వర్గ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి, శాఖ కార్యదర్శి మారబోయిన నరసింహ, మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్‌, శాఖ సహాయ కార్యదర్శి వేముల నాగరాజు, సీనియర్‌ నాయకులు దొడ్డి భిక్షపతి, వరికుప్పల యాదయ్య, వేముల చంద్రయ్య, కోమ్మిడి సత్తిరెడ్డి, వేముల జ్యోతి బాబు, విష్ణు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -