– విత్తన ముసాయిదా చట్టం-2025పై అభ్యంతరాలున్నారు : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దృష్టికి తీసుకెళ్లిన రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
– సీసీఐ విషయంలో కేంద్రంతో మాట్లాడుతానని హామీనిచ్చిన గవర్నర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కపాస్ కిసాన్ యాప్‌లో దరఖాస్తు, ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు, 12 శాతం తేమ వంటి సీసీఐ నిబంధనలతో పత్తి రైతులు పరేషాన్ అవుతున్నారనీ, అనివార్యంగా దళారులకు పత్తి అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దృష్టికి తెలంగాణ రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి తీసుకెళ్లారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన విత్తన ముసాయిదా చట్టం-2025పై రైతుసంఘాలు, రైతుల నుంచి అనేక అభ్యంతరాలు వస్తున్నాయని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో రైతు కమిషన్ చైర్మెన్ కోదందరెడ్డి, సభ్యులు కేవీఎన్.రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాములునాయక్, భవానీరెడ్డి, భూమి సునీల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరిచిన విషయాన్ని ఎత్తిచూపారు. రైతులు పత్తి అమ్ముకోవాలన్నా కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో అమాయక రైతులు ఇబ్బందులు పడ్తున్నారనీ, దానికి తోడు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమేననే కండిషన్ కూడా రైతుకు తలనొప్పిగా మారిందని వివరించారు. ఈసారి రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందనీ, అధిక వర్షాలు, మొంథా తుఫాన్ వల్ల పత్తి రైతులు తీవ్ర నష్టపోయారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సమస్యను తమరి దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. పత్తి రైతుల విషయంలో కమిషన్ బృందం ఇచ్చిన వినతిపత్రానికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు. సీసీఐ విషయంలో కేంద్రంతో మాట్లాడుతానని హామీఇచ్చారు. విత్తన చట్టం ముసాయిదా విషయంలో పూర్తి వివరాలతో మరోసారి కలవాలని గవర్నర్ సూచించారని కోదండరెడ్డి తెలిపారు.
సీసీఐ నిబంధనలతో పత్తి రైతుల పరేషాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



