Sunday, November 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తి రైతుల రాస్తారోకో

పత్తి రైతుల రాస్తారోకో

- Advertisement -

తేమ శాతం పెంచాలి
కపాస్‌ కిసాన్‌ యాప్‌ రద్దు చేయాలి
ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆందోళనలు

నవతెలంగాణ-నేరడిగొండ/ మునిపల్లి
పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలను నిరసిస్తూ శనివారం ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై రైతులు బైటాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బోథ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షులు ఆడే వసంత్‌రావు మాట్లాడుతూ.. సీసీఐ రైతుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. పత్తి తేమ శాతాన్ని ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 20 శాతం వరకు పెంచాలని, సోయా పంట తేమ శాతాన్ని 8 నుంచి 18శాతం వరకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పత్తి పంటను ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే, రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న కపాస్‌ కిసాన్‌ యాప్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. సీసీఐ తేమ శాతం పేరుతో రైతుల పత్తిని తిరస్కరిస్తోందన్నారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌ వల్ల రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఆ యాప్‌ను రద్దు చేసి, తేమ శాతాన్ని 20 శాతానికి పెంచి రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో రైతు సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

పాత పద్ధతిలోనే పత్తి కొనుగోళ్లు చేయాలని రైతుల ధర్నా
పత్తి పంటను పాత పద్ధతిలో సీసీఐ కొనుగోళ్లు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ ప్లాజా వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. కొత్తగా సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. పాత విధానంలోనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు, పారామిలటరీ పోలీసులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. కంకోల్‌ టోల్‌ ప్లాజా 65 జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్లియర్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, సీపీఐ(ఎం) నాయకులు రమేష్‌ గౌడ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్‌, మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు సతీష్‌ కుమార్‌, రాయికోడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు రసూల్‌ పటేల్‌, బుర్కల పాండు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -