Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తి తేమ శాతాన్ని 16కు పెంచాలి

పత్తి తేమ శాతాన్ని 16కు పెంచాలి

- Advertisement -

– బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కృషి చేయాలి
– రాజకీయాలకతీతంగా రైతులను ఆదుకోవాలి : అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌
నవతెలంగాణ-వికారాబాద్‌

పత్తి తేమ శాతాన్ని 16కు పెంచాలని, రాజకీయాలకతీతంగా రైతులను ఆదుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నెపల్లి అయ్యప్ప కాటన్‌ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని, వికారాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్క్‌ ఫెడ్‌ మక్కల కొనుగోలు కేంద్రాలను స్పీకర్‌ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని లబ్దిదారులకు మంజూరైన 54 కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను, 35 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా మాత్రమే ఉంటుందన్నారు. రైతులకు మేలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. గతేడాది వరకు ఎకరాకు 11 క్వింటాళ్ల వరకు పత్తిని కొనుగోలు చేశారని, ఈ ఏడాది దాన్ని 7 క్వింటాళ్ళకు తగ్గించారని, ఈ నిర్ణయం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని కోరారు. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 అనే సిస్టం తీసివేసి రైతులు ఏ మిల్లుకయినా తీసుకుని వెళ్ళి అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారని.. తెలంగాణ పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదం బాధాకరమని, జరగకూడని ఘటన, వ్యక్తిగతంగా తనకు కూడా చాలా బాధ కలిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులతో సమీక్షలు నిర్వహించి,. తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చిందని, సీఎం చేసిన కృషితో కేసు ముగిసిందని, విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయిస్తామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ కిషన్‌నాయక్‌, సీనియర్‌ నాయకులు మహిపాల్‌ రెడ్డి, వి.సత్యనారాయణ, రామచంద్రారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్లు విజయభాస్కర్‌రెడ్డి, మహేందర్‌ రెడ్డి, నాయకులు ముతహర్‌ షరీఫ్‌, రెడ్యా నాయక్‌, పెండ్యాల అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -