యూరియాపై వాయిదా తీర్మానం తిరస్కరణ
పోడియం వద్ద నిరసన తెలిపిన బీఆర్‌ఎస్
ప్రశ్నోత్తరాలు, స్పెషల్ మెన్షన్‌లో పలు అంశాలు లేవనెత్తిన సభ్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రయివేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ ) అమెండ్‌మెంట్ బిల్-2026ను శాసనమండలి శనివారం ఆమోదించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లును ప్రవేశపెట్టగానే యూరియా కొరతపై ఇచ్చిన వాయిదా తీర్మానం గురించి బీఆర్‌ఎస్ సభ్యులు ప్రస్తావించారు. బిల్లు ఆమోదం తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని స్పీకర్ చెప్పినప్పటికి వారు శాంతించ లేదు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లు ఆమోదం పొందిందని బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన మధ్యనే స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేశారు. అంతకు ముందు జరిగిన స్పెషల్ మెన్షన్‌లో పలువురు సభ్యులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. స్వర్ణకారులు, వండ్రంగులపై అధికారుల వేదింపులు ఆపాలని బీఆర్‌ఎస్ సభ్యుల ఎస్.మధుసూదనాచారి, వెల్‌నెస్ సెంటర్లలో వైద్య సేవలు మెరుగు పర్చాలని బీజేపీ సభ్యులు ఎవీఎన్.రెడ్డి కోరారు. పాత బస్తీలో రోడ్లపై గుంతలను వెంటనే పూడ్చాలని ఎంఐఎం సభ్యులు మీర్జా అహ్మద్ బేగ్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆంక్షలు తొలగించడంతో పాటు ఇండ్ల సంఖ్యను పెంచాలని సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం, ఉద్యోగుల పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలనీ, నిరుద్యోగ యువత తమ కాళ్ల మీద తాము నిలబడేలా ఉపాధి పథకాలను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2,500 ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యులు నవీన్‌కుమార్‌రెడ్డి, వరంగల్‌లో టీజీఐఐసీ ద్వారా ప్రతిపాదించబడిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం వెంటనే చేపట్టాలని సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో హైదరాబాద్‌లో లింక్ రోడ్లను నిర్మించాలని సభ్యులు వెంకటరామ్‌రెడ్డి, ఎంఈవో ఖాళీలను భర్తీ చేయాలని బీజేపీ సభ్యులు మల్క కొంరయ్య, స్వాతంత్ర పోరాట యోధులు పండుగ సాయన్న వర్దంతిని అధికారికంగా జరపాలని బీఆర్‌ఎస్ సభ్యులు బండ ప్రకాశ్ కోరారు. వాహనాలపై పెండింగ్ చాలన్లు ఎత్తివేయాలని సభ్యులు తీన్మార్ మల్లన్న, స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ సభ్యులు దాసోజు శ్రవణ్, హోంగార్డుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంగ్రెస్ సభ్యులు పట్నం మహేందర్‌రెడ్డి, గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్ సభ్యులు ఎల్.రమణ, గ్రామపం చాయతీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ సభ్యులు శంకర్ నాయక్, ఆలయాల్లో దూపదీప నైవేద్యాల నిధులు పెంచాలని బీఆర్‌ఎస్ సభ్యులు వాణిదేవి విజ్ఞప్తి చేశారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలను నోట్ చేసుకున్న మైనార్టీ శాఖ మంత్రి అజహరుద్దీన్ తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రయివేట్ యూనివర్సిటీస్ బిల్లుకు మండలి ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



