ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌ను పట్టించుకోని ఇజ్రాయిల్, హమాస్
గాజా శాంతి ప్రణాళికకు అంగీకరించేలా టర్కీ జోక్యం కోరుతున్న అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయిల్ దాడుల్లో పదిమంది పాలస్తీయన్లు మృతి
న్యూయార్క్ : అందితే జుట్టు..అందకపోతే కాళ్లు పట్టుకున్న చందంగా డోనాల్డ్ ట్రంప్ తీరు కనిపిస్తోంది. ఆయన పాక్..భారత్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ నోబెల్ బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయిల్, హమాస్‌ల మధ్య యుద్ధం ఆపానంటూ చెబుతున్నా… ఇజ్రాయిల్ క్షిపణి దాడులతో తెగబడుతూనే ఉన్నది. బుధవారం జరిపిన దాడుల్లో కనీసం పదిమంది చనిపోయారు. వాస్తవానికి ట్రంప్ హెచ్చరికలు, డెడ్‌లైన్‌లను ఎవరూ పట్టించుకోవడం లేదని సమాచారం. ఎలాగైనా ఇజ్రాయిల్, హమాస్ మధ్య శాంతిని తీసుకురావాలనే అమెరికా అధ్యక్షుడి ప్రయత్నం కాస్త బెడిసికొడుతుందనే చెప్పవచ్చు. గాజా శాంతి ప్రణాళికపై చర్చలంటూనే ఇజ్రాయిల్ ట్రంప్‌ను లెక్కచేయటం లేదు. ముందుగా ఇజ్రాయిల్‌ను కట్టడి చేయాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. అంత వరకూ తమ అదుపులో ఉన్న బందీలను విడుదల చేయబోమని కరాఖండిగా చెబుతోంది.
దీంతో శాంతి ప్రణాళిక అనిశ్చితంగానే ఉండటంతో.. ట్రంప్ ఇప్పుడు టర్కీ సహాయం కోరుతున్నారు. గాజా శాంతి ప్రణాళిక విషయంలో అమెరికా అధ్యక్షుడు తనను సహాయం కోరారని టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగన్ అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఈ శాంతి ప్రణాళికను అంగీకరించేలా హమాస్‌ను ఒప్పించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. తాను ఇప్పటికే హమాస్‌తో సంప్రదింపులు జరుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న అన్ని పార్టీలతో సంప్రదిం పులు జరుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజలకు ఏది ఉత్తమమైన విధానం, ఏది సరైనదో వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఈజిప్టులో ఇజ్రాయిల్-హమాస్ చర్చల సందర్భంగా టర్కిష్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇబ్రహీం కాలిన్ కూడా ఉన్నారని గమనించాలి. అంతకుముందు, ట్రంప్ ప్రణాళికకు సంబంధించి ఈజిప్టులో జరుగుతున్న చర్చల పట్ల హమాస్ ఆశావాదంగా ఉందని పేర్కొంది. ఈ స్వాప్ ఒప్పందం కింద విడుదల చేయాల్సిన ఇజ్రాయిల్ బందీలు, పాలస్తీనా ఖైదీల జాబితాను కూడా హమాస్ సమర్పించింది.
అయితే, హమాస్ దీనికి కొన్ని షరతులు విధించింది. వాటిని పాటించకుండా ఒప్పందం సాధ్యం కాదని సంస్థ స్పష్టం చేసింది. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో ఇజ్రాయిల్ , హమాస్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ట్రంప్ 20-పాయింట్ల ప్రణాళికపై ఆధారపడి ఉన్నాయి. ఇది గాజాకు శాశ్వత శాంతిని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య రెండేండ్లుగా యుద్ధం జరుగుతోంది. గాజాలో ప్రారంభమైన వివాదం మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలకు వ్యాపించింది. ఇజ్రాయిల్ జరిపిన బాంబు దాడుల్లో గాజాను శిథిలావస్థకు చేర్చింది. రెండేండ్ల యుద్ధంలో 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ యుద్ధం గాజాను 69 సంవత్సరాలు వెనక్కి నెట్టిందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. గాజా నుంచి శిథిలాలను తొలగించడానికే 21 ఏండ్లు పడుతుందని అంచనా.