ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాల ఏర్పాటు
రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,996 వార్డుల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న లెక్కింపు కోసం 123 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొంటారు. మున్సిపాల్టీ, కార్పొరేషన్లలోని వార్డుల సంఖ్య ఆధారంగా 15 నుంచి 35 వరకు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌పై జరుగుతున్న లెక్కింపు ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లను తెరుస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల వారీగా 25 చొప్పున బెండల్స్ కడతారు. అనంతరం వాటిని లెక్కిస్తారు. తొలి ఫలితం మధ్యాహ్నం 12 గంటల వరకు వస్తుందని భావిస్తున్నారు.
పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ల ఎన్నికకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 16న సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం అదే రోజు ఎన్నిక నిర్వహిస్తామని పేర్కొంది. ఏదైనా కారణం చేత ఎన్నిక వీలు కాకుంటే మరుసటి రోజు ఫిబ్రవరి 17న నిర్వహించనున్నామని తెలిపింది. నేరుగా ఎన్నికైన సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్లైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నుకోనున్నారని పేర్కొంది. ఎన్నిక జరిగే ప్రాంతంలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, వాల్ క్లాక్, పార్టీల వారీగా సీట్ల ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది.



