Tuesday, April 7, 2026
E-PAPER
Homeజాతీయందేశాల అప్పులు పెరిగాయి

దేశాల అప్పులు పెరిగాయి

- Advertisement -

పశ్చిమాసియా సంక్షోభంతో క్లిష్ట పరిస్థితులు : కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ వెల్లడి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు :సెబీ చైర్మెన్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లను విసురుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం దిశగా పని చేస్తున్న తరుణంలో భారత్‌ బాహ్య, అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి స్పష్టం చేశారు. వర్షపాతం వంటి అంశాలు కీలకమైన దేశీయ ఆందోళనలుగా ఉన్నాయని తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్‌ మాట్లాడారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణల కారణంగా ప్రాంతీయ భద్రతా సమస్యలు తలెత్తాయని దీంతో భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత క్లిష్టంగా ఉండే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సంఘర్షణను ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ముప్పుగా పరిణమించిన ఒక వ్యవస్థాగత ప్రకంపన (సిస్టమిక్‌ ట్రెమర్‌) గా అభివర్ణించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత, అస్పష్టతను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రభుత్వ అప్పులు పెరిగాయని మంత్రి చెప్పారు. అయితే.. రుణ నిర్వహణలో భారతదేశం ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థల తరహాలోనే జడిపిలో 81 శాతం లోపు అప్పు నిష్పత్తిని కలిగి ఉందన్నారు. ప్రపంచ సవాళ్ల దృష్ట్యా ప్రభుత్వ రుణాలను చాకచక్యంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. భారతదేశానికి ఆర్థిక వెసులుబాటు ఉందని, పెట్టుబడి వ్యయాన్ని విస్తరించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రభావిత రంగాలకు వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా మద్దతు ఇచ్చే అవకాశం రిజర్వ్‌ బ్యాంక్‌కు ఉందని ఆమె వెల్లడించారు. గ్లోబల్‌ మార్కెట్లలో నెలకొన్న అస్పష్టతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని మంత్రి అన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు : సెబీ చైర్మెన్‌ హెచ్చరిక
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయని సెబీ చైర్మెన్‌ తుహిన్‌ కాంత పాండే ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముడి చమురు, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరగడానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. సోమవారం జరిగిన సీఐఐ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. కరోనా సృష్టించిన అస్థిరత, కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతిక మార్పుల సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరోసారి సంక్షోభంలోకి నెట్టేస్తోందని హెచ్చరించారు. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు తమ ఉనికిని చాటుకోవాలంటే పటిష్టమైన పాలనా ప్రమాణాలు పాటించడం అత్యవసరమన్నారు. కంపెనీల బోర్డు నిర్ణయాల్లో నాణ్యత పెరగాలని, ముఖ్యంగా స్వతంత్ర డైరెక్టర్లు సంస్థల పర్యవేక్షణలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -