నవతెలంగాణ ఖమ్మం: తమ తల్లిదండ్రులు తమ ప్రేమను నిరాకరించారని మనస్థాపనతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లాలోని పండితాపురంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బండి హారిక,గాడిపల్లి శ్రీకాంత్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. వీరి ప్రేమ గురించి ఇళ్లల్లో చెప్పారు.. అయితే.. హారిక తల్లిదండ్రులు మాత్రం వీరి ప్రేమను నిరాకరించారు. దీంతో హారిక తీవ్ర మనస్థాపానికి గురైంది.. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది..
హారిక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని సమాచారం అందుకున్న శ్రీకాంత్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. హారిక చనిపోయిన రెండు గంటల వ్యవధిలో శ్రీకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు ఇద్దరు చనిపోవడంతో.. పండితాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.
మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఇరు కుటుంబాలకు మృతదేహాలను అప్పగించారు. అయితే.. మృతుల ఇళ్లు పక్క పక్కనే ఉండడంతో ఇద్దరి కుటుంబాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని పోలీసుల అలర్ట్ అయ్యారు.
ఇరువురి నుంచి కంప్లైంట్ తీసుకొని ఒకరిపై ఒకరు గొడవలు పడకుండా పోలీసులు సమన్వపరిచారు.. రెండు కుటుంబాలు నష్టపోయాయి కనుక ఎవరినీ ఎవరూ దూషించుకోవద్దని.. పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని సర్ది చెప్పారు.
అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య మొదటిగా అమ్మాయి మృతదేహాన్ని గ్రామానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. గంటల వ్యవధిలో అబ్బాయి మృతదేహాన్ని గ్రామానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.