Wednesday, February 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను కప్పిపుచ్చుతున్నారు

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను కప్పిపుచ్చుతున్నారు

- Advertisement -

ట్రంప్‌పై మండిపడిన హిల్లరీ క్లింటన్‌

బెర్లిన్‌ : జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైల్స్‌ను డోనాల్డ్‌ ట్రంప్‌ కప్పిపెడుతున్నారని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ విమర్శించారు. ‘ముందు వాటిని బయటపెట్టండి. అవి నత్తనడక నడుస్తున్నాయి’ అని బెర్లిన్‌లో ఆమె బీబీసీకి చెప్పారు. ప్రపంచ ఫోరం వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు హిల్లరీ బెర్లిన్‌ వచ్చారు. ఎప్‌స్టీన్‌కు చెందిన వేలాది ఫైల్స్‌ను అమెరికా న్యాయ శాఖ ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ కమిటీ ముందు హాజరు కావాల్సిందేనని హిల్లరీ స్పష్టం చేశారు. కమిటీ ముందు సాక్ష్యమివ్వాల్సిందిగా కాంగ్రెస్‌ కమిటీ క్లింటన్‌ దంపతులపై ఒత్తిడి తెచ్చింది. కమిటీ ఎదుట హాజరయ్యేందుకు వారు అంగీకరించారు. బిల్‌ క్లింటన్‌ ఈ నెల 27న, హిల్లరీ ఈ నెల 26న కమిటీ ముందు హాజరవుతారు.

1983లో అమెరికా మాజీ అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌ కాంగ్రెస్‌ కమిటీ ముందు హాజరయ్యారు. ఆ తర్వాత దేశ మాజీ అధ్యక్షుడు కమిటీ ముందుకు రావడం ఇదే మొదటి సారి. కమిటీ ఎదుట హాజరయ్యేందుకు తమకు అభ్యంతరం ఏమీ లేదని, అయితే అది బహిరంగంగా జరగాలని హిల్లరీ చెప్పారు. కమిటీ దర్యాప్తు నిస్పాక్షికంగా జరపాలన్నదే తమ కోరిక అని, అందరినీ ఒకేలా చూడాలని ఆశిస్తున్నానని అన్నారు. ‘మా వద్ద దాచేందుకు ఏమీ లేదు. ఫైల్స్‌ను పూర్తిగా విడుదల చేయాలని మేము పదే పదే అడుగుతున్నాం’ అని తెలిపారు. ట్రంప్‌ నుంచి దృష్టి మళ్లించేందుకు తనను, తన భర్తను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కాగా ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో క్లింటన్‌ ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే. ఎప్‌స్టీన్‌తో గతంలో తనకు సంబంధం ఉన్నప్పటికీ రెండు దశాబ్దాల క్రితమే దానికి స్వస్తి చెప్పానని క్లింటన్‌ అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -