నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం గీతం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య భారతమాత ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పదం మన ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాల రగిలించే శక్తిని కలిగి ఉంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భం మనందరికీ గర్వకారణం.
ఈ గీతం మన స్వాతంత్య్రసమరయోధులకు ప్రేరణ గా నిలిచినట్లే, నేటి తరం యువతకు దేశప్రేమ కర్తవ్యనిష్ట ఐక్యత అనే విలువలను స్ఫూర్తిగా అందిస్తుంది. ఈ మహోత్సవ సందర్భంగా మన దేశపు తల్లి భూమికి మనమందరం వందనం చేయాలి. “వందేమాతరం ” అని ఆలపించడం కేవలం ఒక గీతం పాడడం కాదు, అది మన తల్లి దేశానికి ఇచ్చే గౌరవ ప్రధమైన ప్రమాణం అని తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (ఎ.ఆర్) రామ చందర్ రావ్ ,ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి , సి.సి.ఆర్.బి సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది మరియు డి.పి.ఓ సిబ్బంది, హెడ్క్వార్టర్స్ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



