– 13ఏండ్ల క్రితం ఐయూఎంఎల్ దాడి
– అప్పటి నుంచి జీవచ్ఛవంగా…
కన్నూర్ : రాజకీయ శతృత్వంతో ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కార్యకర్తలు 13ఏండ్ల క్రితం జరిపిన పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంగా మారిన సీపీఐ(ఎం) కార్యకర్త వెలియారి మోహనన్ (60) శనివారం కన్నుమూశారు. మాతమంగళంలోని శ్మశాన వాటికలో ఉదయం 10గంటలకు ఆయన అంత్యక్రియలు జరిగాయి. అరియిల్‌కి చెందిన కుంజిరామన్, వెలియారి కల్యాణిల కుమారుడే మోహనన్. 2012 ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం మోహనన్‌పై దాడి జరిగింది. 15మందితో కూడిన గుంపు మోహనన్ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలకు చొరబడి ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేసి, కిటికీలు, తలుపలను పగలగొట్టి, తన చిన్న కొడుకుతో కలిసి నిద్రపోతున్న మోహనన్‌ను మంచంపై నుండి బయటకు లాక్కుని వచ్చి దాడికి పాల్పడింది. ఈ దాడికి పాల్పడిన వారిలో స్థానిక నేతలు, ముస్లిం లీగ్‌లో చురుకుగా వున్న సభ్యులు మహ్మద్ సాలిహ్, ఎం.రవూఫ్‌లు కూడా వున్నారు.
సాలిహ్ కొట్టడంతో పక్క గదిలో చదువుకుంటున్న పెద్ద కొడుకు మిథున్ గాయపడ్డాడు. మోహనన్ భార్య రాధా, తల్లి కల్యాణిలు కూడా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా చితకబాదారు. మోహనన్‌పై దాడి చేస్తున్న వారిని ఆపేందుకు ప్రయత్నించడంతో సాలిహ్, రాధాను నేలపైన పడేసి కొట్టాడు. ఈలోగా మోహనన్ పారిపోవడానికి ప్రయత్నించగా, దుండగులు వెంటాడి, పదే పదే కొట్టారు. దీంతో మోహనన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో వారు అతనిని లాక్కుంటూ దూరంగా గల అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోయారు. మోహనన్ చనిపోయాడని వారనుకున్నారు. రాధా వారిని అనుసరించడానికి ప్రయత్నించి, దుండగులను చూసి భయపడింది. ఈలోగా విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు, పార్టీ కార్యకర్తలు వెళ్ళిచూడగా రక్తపు మడుగులో పడి మోహనన్ కనిపించాడు. తలకు, ఛాతీకి, పొట్టకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనకు జ్ఞాపక శక్తి పోవడమే కాదు, మాటలు కూడా పోయాయి. ఏండ్ల తరబడి చికిత్సనందించిన తర్వాత ఆయన మాతమంగళంలోని ఇంట్లో భార్యతో వుంటున్నారు. శనివారం ఉదయం మృతిచెందారు.
సీపీఐ(ఎం) కార్యకర్త వెలియారి మోహనన్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -