మిర్యాలగూడలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాటం చేసే అభ్యర్థులను గెలిపించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 17వ వార్డులో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి మధులతను గెలిపించాలని కోరుతూ శనివారం ఇంటింటి ప్రచారం చేశారు. వార్డులో గతంలో సీపీఐ(ఎం) కౌన్సిలర్ రామిరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వివరించారు. ప్రజాసమస్యల పట్ల సీపీఐ(ఎం)కు నిబద్ధత ఉంటుందని తెలిపారు. పట్టణంలో మహిళా సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో పాలకవర్గం విఫలమైందని అన్నారు. పట్టణంలో రైల్వే, మురికి నీటి సమస్య, రేషన్‌కార్డులు ఇవ్వడంలో పాలకవర్గం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు ప్రభావతి, వరలక్ష్మి, గోవర్థన తదితరులు పాల్గొన్నారు.
12న సార్వత్రిక సమ్మెకు ఐద్వా మద్దతు
ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు ఐద్వా మద్దతిస్తుందని మల్లు లక్ష్మీ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, మనువాదాన్ని ప్రజలపై రుద్దాలని చూస్తోందని చెప్పారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించకుండా వీబీజీఆర్‌ఏఎం-జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ కార్మికుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
మహిళా సంఘం పోరాటం వల్లే నేడు ఆస్తిలో మహిళలకు హక్కు, లైంగిక వేధింపుల నిరోదక చట్టం, నిర్భయ లాంటి చట్టాలు వచ్చాయని వివరించారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడి మహిళలను అవమానించే విధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. చట్టాలు ఎన్ని వచ్చినప్పటికీ మహిళలకు అన్యాయం జరుగుతోందని, వాటిపై ఉద్యమించక తప్పదని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టి బస్సుల సంఖ్య పెంచకపోవడం సముచితం కాదన్నారు.


