Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలి

సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలి

- Advertisement -

పలు చోట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర నేతల ప్రచారం

నవతెలంగాణ- విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రజలను కోరారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ కలిసి మిత్రపక్షాల (బీఆర్‌ఎస్‌, సీపీఐ(ఎం)) అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం చేపట్టారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ పట్టణం అన్ని రకాలుగా అభివృద్ది చెందిందని, రూ.వందల కోట్ల నిధులను తీసుకొచ్చి పట్టణంలో నెలకొన్న సమస్యలను తొలగించి ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.

కానీ రెండేండ్ల కాంగ్రెస్‌ హయాంలో ఇప్పటివరకు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. ‘మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల పండుగ రావడంతో వివిధ పార్టీల నాయకులు వస్తుంటారు.. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి.. గెలిచిన తర్వాత పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేందుకే ప్రయత్నిస్తారు తప్పా.. ప్రజల సమస్యలు తీర్చబోరు. కావున ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి.. అధికారం ఉన్నా లేకున్నా ప్రజలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని’ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 35వ డివిజన్‌ నుంచి నూర్జహాన్‌, 10వ డివిజన్‌ నుంచి పెద్దివెంకట్‌రాములు, 11వ డివిజన్‌ నుంచి బెజ్గం సుజాత బరిలో నిలవగా.. వారి తరఫున సోమవారం ప్రచారం నిర్వహించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపిస్తే బాధ్యతగా సేవ చేస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార చివరి రోజు కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 8, 9, 12వ వార్డులలో మిట్టగడుపుల ముత్యాలు, కుక్కడపు నలిని, నక్కకుమారి గెలుపును కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ‘ప్రజా గొంతుక అయ్యేది.. సమస్యలపై నిత్యం ప్రజల తరఫున కొట్లాడేది కేవలం ఎర్రజెండా మాత్రమే.. అలాంటి ఎర్రజెండా నాయకులు ఎన్నికల బరిలో నిలిచారు… వారిని భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి బండ్ల స్వామికి మద్దతుగా చుక్క రాములు ప్రచారం నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -