* “సామినేని” హంతకులు ఎవరో ప్రజా తీర్పుతో స్పష్టం చేసిన ఓటర్లు
* సర్పంచ్ అభ్యర్థి బొర్రా ప్రసాద్ సతీమణి ఉమ ఘోర ఓటమి
* సామినేని రామారావు హత్య కేసులో ఏ-2 నిందితుడు బొర్రా ప్రసాద్ పరాజయం
* పాతర్లపాడులో 12 వార్డులలో కాంగ్రెస్ ఘోర పరాజయం
* సామినేని హంతకులకు, తప్పుడు ప్రచారాలకు ఓటర్లు గుణపాఠం
* అధికార, పోలీసుల అండ, ధన బలాన్ని ఓడించిన ఓటర్లు
* ఓటర్ల తీర్పుతో నిందితులను అరెస్టు చేయాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ – బోనకల్ : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే చింతకాని మండలం పాతర్లపాడు గ్రామపంచాయతీలో కాంగ్రెస్ నాయకుల హత్య రాజకీయాలకు ఓటర్లు ప్రజాతీర్పుతో గుణపాఠం చెప్పారు. సామినేని రామారావు హంతకులు ఎవరో ఓటర్ల ప్రజాతీర్పుతో స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుడు ప్రచారానికి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారు. సామినేని రామారావు హంతకులు ఎవరో కాదు కాంగ్రెస్ నాయకులేనని ప్రజలు తమ తీర్పు వెల్లడించారు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోనే చింతకాని మండలం పాతర్లపాడు గ్రామపంచాయతీ ఉంది.చింతకాని మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ పంచాయతీ ఎన్నికలు ఈనెల 11వ తేదీన జరిగాయి.
పాతర్లపాడు గ్రామపంచాయతీ ఎన్నికలలో సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఓబినబోయిన లక్ష్మి పోటీ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సామినేని రామారావు హత్య కేసులో ఏ- 2 గా ఉన్న బొర్రా ప్రసాద్ సతీమణి ఉమ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచింది. అదేవిధంగా ఆరో వార్డు మెంబర్ గా బొర్రా ప్రసాద్ రంగంలోకి దిగాడు. సిపిఎం అభ్యర్థి ఓబినబోయిన లక్ష్మికి సీపీఐ, బీఆర్ఎస్, బిఎస్పి మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్ అభ్యర్థికి టిడిపి మద్దతుగా నిలిచింది. పాతర్లపాడు లో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులలో సిపిఎం 11 వార్డులలో పోటీ చేయగా, మిత్రపక్షమైన బీఆర్ఎస్ ఒక వార్డులో పోటీ చేసింది. కాంగ్రెస్ సర్పంచ్ తో పాటు పది వార్డులకు పోటీ చేసింది. కాంగ్రెస్ మిత్రపక్షమైన టిడిపి రెండు వార్డులలో పోటీ చేసింది.ఇక్కడ నుంచి అసలు తంతు ప్రారంభమైంది.
పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రాష్ట్ర నాయకులు, ఆ గ్రామ మాజీ సర్పంచ్ సామినేని రామారావుని 31 అక్టోబర్ 2025న కాంగ్రెస్ గుండాలు హత్య చేశారని కేసు నమోదయింది. సామినేని రామారావు భార్య సతీమణి స్వరాజ్యం తన భర్తను పాతర్లపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులతో పాటు మరికొంతమంది అత్యంత కిరాతకంగా హత్య చేశారని చింతకాని పోలీస్ స్టేషన్లో 31 అక్టోబర్ 2025న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చింతకాని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ-1గా గుర్తుతెలియని వ్యక్తులు, ఏ – 2 గా బొర్రా ప్రసాద్, ఏ- 3 గా కంచుమర్తి రామకృష్ణ, ఏ – 4 గా మద్దినేని నాగేశ్వరరావు, ఏ- 5 గా కాండ్ర పిచ్చయ్య,
ఎ – 6 గా కొత్తపల్లి వెంకటేశ్వర్లు పోలీసులు ఎఫ్ఐఆర్ (నెంబర్ 324/2025) నమోదు చేశారు. జనరల్ డైరీలో రిసెప్షన్ ఎంట్రీ నెంబర్ 5 గా నమోదు చేశారు. పాతర్లపాడు గ్రామపంచాయతీ ఎన్నికలలో నేరుగా బొర్రా ప్రసాద్, హత్య కేసులో నిందితులు రంగంలోకి దిగారు. పది రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రచారంలో బొర్రా ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు అధికారం, డబ్బుతో ఓటర్లను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రచారం నిర్వహించారు. అధికార బలం, పోలీసుల బలంతో సీపీఐ(ఎం) అభ్యర్థులను స్వేచ్ఛగా ప్రచారం కూడా చేసుకొనినివ్వలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా అడుగడుగునా నిబంధనల పేరుతో ప్రచారానికి అడ్డంకులు సృష్టించారు. అయినా ఉన్న అవకాశాల మేరకే సీపీఐ(ఎం), బిఆర్ఎస్, సీపీఐ, బిఎస్పి నాయకులు, అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించుకున్నారు. బొర్రా ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం ఇష్టా రీతిగా ప్రచారం నిర్వహించారు. అందుకు పోలీసులు కూడా వారికి పూర్తిస్థాయిలో సహకరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు అనేక రకాలుగా కవ్వింపులకు దిగిన సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు ఓపికకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. సామినేని రామారావు హత్యపై కాంగ్రెస్ నాయకులు అనేక రకాలుగా తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. అయినా గ్రామ ఓటర్లు సహనాన్ని ప్రదర్శించారు. ఓటర్లకు డబ్బులను విచ్చలవిడిగా వెదజల్లారు. ఏ రకంగానైనా సీపీఐ(ఎం) అభ్యర్థులను ఓడించాలని పట్టుదలతో కాంగ్రెస్ నాయకులు చేయకూడని అన్ని రకాల పనులు నేరుగా పోలీసుల సమక్షంలోనే చేశారు. సీపీఐ(ఎం)పై నిర్బంధాలు ప్రయోగించారు. గొడవలు సృష్టించారు. అయినా పోలీసులు వారికి అండగా నిలిచినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ప్రచార పరం సాగింది.
ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. పది రోజులపాటు కాంగ్రెస్ చేసిన అరాచకం ఇంత అంతా కాదు. పోలింగ్ రోజు ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బొర్రా ప్రసాద్ సతీమణి ఉమతో పాటు బొర్రా ప్రసాద్ కి కూడా ఘోరంగా ఓటర్లు ఘోరీ కట్టారు. కాంగ్రెస్ పోటీ చేసిన పది వార్డులలోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దాని మిత్రపక్షమైన టిడిపి ఒకే ఒక వార్డులో విజయం సాధించింది. సీపీఐ(ఎం) దాని మిత్రపక్షాలు 11 వార్డులలో అఖండ విజయం సాధించారు. ఈ ఎన్నికల తీర్పు ద్వారా ప్రజలు కాంగ్రెస్ నాయకులకు గుణపాఠం నేర్పారు. సామినేని రామారావుని హత్య చేసింది కాంగ్రెస్ నాయకులేనని పాతర్లపాడు గ్రామ ప్రజలందరూ ప్రగాఢ విశ్వాసం, నమ్మకంతో ఉన్నారు. ఆ విధంగా ఎన్నికలలో సామినేని రామారావుని హత్య చేసింది కాంగ్రెస్ నాయకులేనని ఓటర్ల స్పష్టమైన తీర్పునిచ్చారు.
ఈ ప్రజా తీర్పుతో అయినా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి నిందితులను అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పుని పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూద్దాం. 11 వార్డులలో సిపిఎం పోటీ చేయగా 10 వార్డులలో విజయం సాధించగా, ఒక వార్డులో మిత్రపక్షం బిఆర్ఎస్ విజయం సాధించింది. కేవలం ఒకే ఒక స్థానం కాంగ్రెస్ మిత్ర పక్షమైన టిడిపి గెలుచకుంది. కాంగ్రెస్ పోటీ చేసిన పది స్థానాలలోనూ ఘోర పరాజయం పాలయ్యారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బొర్ర ఉమ, ఆరవ వార్డులో పోటీ చేసిన బొర్రా ప్రసాద్ ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. బొర్రా ప్రసాద్ పై సీపీఐ(ఎం) మిత్రపక్షం బిఆర్ఎస్ అభ్యర్థి 40 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
సీపీఐ(ఎం) అభ్యర్థులు ఒకటో వార్డులో 63 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండవ వార్డ్ లో 97, మూడవ వార్డులో 57, నాలుగో వార్డులో 45, 5వ వార్డులో 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏడవ వార్డులో 37, 8 వ వార్డులో 19, 10 వ వార్డులో 18, 11వ వార్డులో 9, 12 వ వార్డులో 70 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పాతర్లపాడు లో మొత్తం 2,720 ఓట్లు ఉన్నాయి. మొత్తం 2,557 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ(ఎం) అభ్యర్థికి 1,532 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 968 ఓట్లు వచ్చాయి. దీంతో సీపీఐ(ఎం) అభ్యర్థిని ఓబినబోయిన లక్ష్మి 567 భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఉప సర్పంచ్ గా సీపీఐ(ఎం)కి చెందిన 11వ వార్డు మెంబర్ దారెల్లి సురేష్ ఎన్నికయ్యాడు. ఓటర్ల తీర్పుతోనైనా పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే సామినేని రామారావు హంతకులను అరెస్టు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.



