ఇబ్రహీంపట్నంలో రోడ్డెక్కిన సీపీఐ(ఎం) శ్రేణులు
నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్
నాగార్జున సాగర్ జాతీయ రహదారి పై రాస్తారోకో
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో చిన్నారి హత్య ఘటనపై సీపీఐ(ఎం) కన్నెరజేసింది. ఆ పార్టీ శ్రేణులు ఇబ్రహీంపట్నంలోని నాగార్జున సాగర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. చిన్నారి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మెర గ్రామంలో పసి బిడ్డను అత్యంత క్రూరంగా కాలితో తన్ని హత్య చేసిన అగ్రకుల దురహంకారులను కఠినంగా శిక్షించాలన్నారు. పసిబిడ్డను హత్య చేసిన వారిపై అత్యాచార నిరోధక చట్టంతో పాటు అత్య నేరం కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజులవుతున్న బాధితులకు న్యాయం చేయడంలో పోలీసులు, అధికారులు జాప్యం చేయడంపై మండిపడ్డారు. బాలిక హత్య కేసులో నిర్లక్ష్యం వ్యవహరించిన సీఐ, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించక పోవడం సరికాదన్నారు. సీఎం స్పందించాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, మండల కార్యదర్శి సీహెచ్ బుగ్గరాములు, జిల్లా కమిటీ సభ్యులు గోరెంకల నర్సింహా, డి.కిషన్, పి.జగన్, మున్సిపల్ కార్యదర్శి సీహెచ్ ఎల్లెష్, నాయకులు ఎ.వెంకటేష్, ముసిలయ్య, సీహెచ్.శంకర్, పురుషోత్తం, నర్సింహా, స్వప్న, యాదగిరి, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.



