పార్టీ రాష్ట్ర కమిటీ, ఐద్వా సంతాపం
నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు మోటూరి పూర్ణచందర్ రావు (81) ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ లో తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని వెలిగటూరు గ్రామంలో వారు 1944లో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. చిన్న నాటి నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో వివిధ బాధ్యతల్లో పనిచేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఎంటీలో పనిచేస్తూ నగర మార్క్సిస్టు పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరవలేనిదని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆయన మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సంతాపం తెలిపారు. ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్ పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. పూర్ణచందర్ రావు అంత్యక్రియలు బుధవారం ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నట్టు వారు తెలిపారు.
కార్మిక సంఘంలో కీలక పాత్ర
కామ్రేడ్ మోటూరి పూర్ణచందర్‌రావు కుటుంబం ముందు నుంచీ సీపీఐ(ఎం) పార్టీ కుటుంబం కావడం వలన బాల్యం నుంచి ఉమ్మడి పార్టీతోను, చీలిక అనంతరం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుతోను పూర్తి సంబంధం కలిగి ఉన్నారు. 1968లో అతివాద చీలిక అనంతరం హైదరాబాద్ నగర పార్టీ ఉద్యమ నిర్మాణంలో కామ్రేడ్ ఎన్‌విబి, కామ్రేడ్ లక్ష్మీదాస్, కామ్రేడ్ స్వామిలతోపాటు కామ్రేడ్ పూర్ణచందర్‌రావు కృషి ఉంది. ఆ తరువాత ఏర్పడిన కన్వీనింగ్ కమిటీలో వీరు సభ్యులుగా ఉన్నారు. ఆ తరువాత నగరంలో నలుగురు సభ్యులతో ఏర్పడిన నగర కమిటీలో పూర్ణచందర్‌రావు ఒకరు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శిగా 1970 నుంచి ఒక దశాబ్దం పాటు పనిచేశారు. 1978లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. తిరిగి 1981లో కూడా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1966లో ఆయన హెచ్‌ఎంటీలో ట్రైనీగా చేరారు .అనేక ఆటుపోట్లతో హెచ్‌ఎంటీ సంస్థలో పోరాటాలు చేసి సుదీర్ఘ కాలం యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికవ్వవడమే కాక, ఆనాడు ఉన్న ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలలో నాయకత్వం అభివృద్ధి కావడానికి కామ్రేడ్ పూర్ణచందర్‌రావు ఎంతో కృషి చేశారు. 1982 -1983 తర్వాత కొన్ని సమస్యల కారణంగా చురుకైన పాత్రను మానుకున్నారు. కానీ పార్టీ అభిమానిగానే చివరి వరకు కొనసాగారు. ఉమ్మడి రాష్ట్ర మహిళా సంఘ కార్యాలయం ఏర్పాటులో కామ్రేడ్ పూర్ణచందర్‌రావు పాత్ర అమోఘమైనది. దాని నిర్మాణంలో నిధుల వసూలు మాత్రమే కాక భౌతికంగా కూడా తన శక్తి యుక్తుల్ని అందించారు.