Saturday, November 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసీపీఐ(ఎం) నేత సామినేని దారుణ హత్య

సీపీఐ(ఎం) నేత సామినేని దారుణ హత్య

- Advertisement -

పథకం ప్రకారమే కత్తులతో దాడి
పెనుగులాటలో నిందితుని చొక్కా చినిగి రామారావు చేతిలోకి..
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం సీపీ సునీల్‌ దత్‌
ఉలిక్కిపడ్డ పాతర్లపాడు.. కన్నీరు మున్నీరైన స్థానికులు
నా భర్తను కాంగ్రెస్‌ గూండాలే హత్య చేశారు : స్వరాజ్యం
దసరా పండుగ రోజే బెదిరించి వెళ్లారు..

నవతెలంగాణ-బోనకల్‌/చింతకాని
సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు(73)ను శుక్రవారం ఉదయం 5:30 నుంచి 6:30 గంటల మధ్య గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మృతునికి భార్య స్వరాజ్యం, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్‌ నాయకులు సామినేని రామారావు శుక్రవారం ఉదయం ఐదు గంటల సమయంలో నిద్ర లేచి.. కాలకృత్యాలు పూర్తిచేసుకొని ఇంటి ముందు కొద్దిసేపు వాకింగ్‌ చేశారు.

ఆ తర్వాత తన ఇంటి ఆవరణలోనే ఉన్న కొట్టంలో కోళ్లను విడిచి పెట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో హంతకులు వెనుక నుంచి రామారావుని కత్తులతో పొడిచారు. పొట్టపై పొడవడంతో పేగులు బయటికి వచ్చాయి. శరీరంపై సుమారు 8 నుంచి 10 కత్తిపోట్లు ఉన్నాయి. హత్య సమయంలో రామారావుకు, హంతకులకు మధ్య జరిగిన పెనుగులాటలో హంతకులకు సంబంధించి ఓ షర్టు చినిగి రామారావు చేతిలో ఉంది. సంఘటనా సమయంలో రామారావు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ఇంటి ముందు ఉన్న హౌటల్‌ యజమాని అక్కడికి వచ్చేలోపే నిందితులు పారిపో యారు. రామారావు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి వెంటనే రామారావు భార్య స్వరాజ్యాన్ని నిద్రలేపారు. భార్య వచ్చి చూడగా అప్పటికే రామారావు రక్తపు మడుగులో మృతిచెంది ఉన్నాడు. ఈ సంఘటన గ్రామంలో కొద్ది క్షణాల్లోనే దహనంలా వ్యాపించింది.

పెద్ద ఎత్తున గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఖమ్మం సీపీ సునీల్‌ దత్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు ఘటనపై విచారణ నిర్వహించారు. రాజకీయ హత్య కావటంతో సీపీ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. భార్య స్వరాజ్యంను జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తన భర్తను రాజకీయ కక్షలతోనే కాంగ్రెస్‌ గూండాలే హత్య చేశారని సీపీకి వివరించారు. దాంతో సీపీ స్పందిస్తూ సామినేని రామారావు హంతకులను పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని, వారి కుటుం బానికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో శాంతిభద్రతలకు ఎవరూ విఘాతం కలిగించొద్దని కోరారు. సోషల్‌ మీడియా లో పోస్టులు చేయొద్దన్నారు. కాగా, రామా రావుకు చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవనంపై హంతకుల చెప్పులు కూడా ఉన్నాయి.

కాంగ్రెస్‌ గూండాలే చంపారు : రామరావు భార్య స్వరాజ్యం
తన భర్తను కాంగ్రెస్‌కు చెందిన గూండాలు బొర్ర ప్రసాద్‌, కంచుమర్తి రామకృష్ణ, (ఆర్కే), మద్దిని నాగేశ్వరరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు (చిన్నబ్బాయి), తాండ్ర పిచ్చయ్య, మరి కొంతమంది కలిసి హత్య చేశారని స్వరాజ్యం తెలిపింది. దసరా పండుగ రోజు కంచుమర్తి రామకృష్ణ, బొర్ర ప్రసాద్‌ తన భర్త రామారావును, తనను చంపుతామని బెదిరించారని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అధికార పార్టీ ఒత్తిడికి లొంగకుండా నిజాయితీగా, నిష్పక్షపాతంగా విచారణ చేసి తనకు న్యాయం చేయాలని స్వరాజ్యం ఖమ్మం సీపీ సునీల్‌ దత్‌ను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -