నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను పూర్తి చేసి వైద్యులను నియమించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని సీపీఐ(ఎం) చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు గోశిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుప్పల్ పరిసర ఎనిమిది మండలాల ప్రజలు వైద్య సేవల కోసం ఈ ఆస్పత్రి పై ఆధారపడుతున్నారని తెలిపారు.
హైవే రహదారి కారణంగా తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరోవైపు హైదరాబాదులోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం రూ.36 కోట్ల వ్యయంతో వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ, ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంవత్సరాలు గడిచినా ఆస్పత్రి ప్రారంభం కాలేదని కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అవసరమైన అన్ని రకాల వైద్యులను నియమించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, అవ్వారి రామేశ్వరి చౌటుప్పల్ 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మదాసు గౌడ్ నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, ఆదిమూలం నందీశ్వర్, ఆకుల ధర్మయ్య, కందగట్ల ఆనంద్, సప్పిడి శ్రీనివాసరెడ్డి, చికూరు ఈదయ్య, మోగుదాల రాములు, ఎండి జానీ, సోమరాజు,యాదయ్య, పంతంగి సంధ్య, సుర్వి వెంకటేష్, యాదమ్మ, సుర్వి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.



