నవతెలంగాణ – హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో సంప్రదింపులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం నిర్వచన్ సదన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.ఏ. బేబీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. జాతీయ, రాష్ట్ర పార్టీల అధ్యక్షులతో ఈసీఐ నిర్వహిస్తున్న సంప్రదింపుల్లో భాగంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు తమ సూచనలు, ఆందోళనలను నేరుగా ఎన్నికల సంఘంతో పంచుకునేందుకు వీలుగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్ఠం చేయడంలో, ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లో అన్ని పక్షాలతో కలిసి పనిచేయడంలో భాగంగా ఉన్నాయని ఈసీఐ తెలిపింది. ఇంతకుముందు మే 6న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు కుమారి మాయావతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం, మే 8న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా నేతృత్వంలోని బృందం ఎన్నికల సంఘంతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 4,719 సమావేశాలు వివిధ రాజకీయ పార్టీలతో జరిగాయి. వీటిలో 40 సమావేశాలు సీఈఓలు, 800 సమావేశాలు డీఈఓలు, 3,879 సమావేశాలు ఈఆర్‌ఓలు నిర్వహించాయి. 28,000 మందికి పైగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సంప్రదింపులు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, సమర్థతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఎన్నికల కమిషన్‌తో సీపీఐ(ఎం) భేటీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES