Wednesday, February 11, 2026
E-PAPER
Homeజాతీయం'మొహ‌మ్మ‌ద్ దీప‌క్‌’కు అండ‌గా సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్

‘మొహ‌మ్మ‌ద్ దీప‌క్‌’కు అండ‌గా సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: దీప‌క్ కుమార్‌కు రాజ్యసభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడు జాన్ బ్రిట్టాస్ (John Brittas) సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ నెల 8న కోట్‌ద్వార్ ప‌ట్ట‌ణానికి వ‌చ్చి దీపక్‌తో పాటు మొహ‌మ్మ‌ద్‌ బాబా డ్రెస్ షాప్‌ యజమాని వకీల్ అహ్మద్‌ను క‌లిశారు. మతతత్వ శక్తుల బెదిరింపుల కారణంగా దీప‌క్ జిమ్‌కు వ‌చ్చే వారి సంఖ్య త‌గ్గడంతో తాను స‌భ్య‌త్వం తీసుకున్న‌ట్టు ఎక్స్‌లో వెల్ల‌డించారు జాన్ బ్రిట్టాస్.

”మత సామరస్యాన్ని గౌరవించే రాష్ట్రమైన కేరళ త‌ర‌పున‌ శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను కోట్‌ద్వార్ ప‌ట్ట‌ణానికి వెళ్లాను. దీపక్‌ను మాత్రమే కాకుండా అతడి తల్లి, భార్య, బిడ్డను కూడా కలిశాను. జీవనోపాధి కోసం టీ అమ్ముకునే అతని తల్లి అందించే వేడి అల్లం టీ తాగాను. మతపరమైన అంశాల బెదిరింపుల కారణంగా ఇప్పుడు నిర్జనమై ఉన్న అతని జిమ్‌ను సందర్శించి సభ్యత్వం తీసుకున్నాను. ముహమ్మద్ బాబా వస్త్ర దుకాణాన్ని కూడా సందర్శించి కొన్ని కొనుగోళ్లు చేశాను. దీపక్‌పై కేసు నమోదు చేసిన కోట్‌ద్వార్ పోలీస్ స్టేషన్‌లో బలమైన నిరసన తెలియ‌జేశాను. ‘ముహమ్మద్’ దీపక్‌గా రూపాంతరం చెందిన దీపక్ కుమార్ కేవలం ఒక వ్యక్తి కాదు.. అతడు భ‌విష్య‌త్ విశ్వాసానికి వజ్ర-ప్రకాశవంతమైన కాంతి” అంటూ జాన్ బ్రిట్టాస్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

38 ఏళ్ల దీప‌క్ కుమార్ ఉత్త‌రాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో హ‌ల్క్ పేరుతో జిమ్ న‌డుపుతున్నాడు. రిప‌బ్లిక్ డే నాడు బజరంగ్ దళ్‌కు చెందిన కొంత‌మంది.. దుకాణం పేరు మార్చాలంటూ ముస్లిం వృద్ధుడిపై ఒత్తిడి తెచ్చారు. పార్కిన్స‌న్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ముస‌లాయన కొంచెం స‌మ‌యం కావాల‌ని వారిని అభ్య‌ర్థించాడు. అయినా వారు వినిపించుకోకుండా వాద‌న‌కు దిగ‌డంతో అక్క‌డే ఉన్న దీపక్ కుమార్ క‌ల‌గ‌జేసుకున్నాడు. బజరంగ్ దళ్ కార్య‌క‌ర్తలు త‌న‌ పేరేంట‌ని అడ‌గ‌డంతో మొహ‌మ్మ‌ద్‌ దీప‌క్ (Mohammad Deepak) అని స‌మాధానం ఇచ్చాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయింది. బీబీసీ స‌హా ప‌లు వార్తా సంస్థ‌లు అత‌డిని ఇంట‌ర్వ్యూ చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -