Wednesday, April 1, 2026
E-PAPER
Homeజాతీయంఎఫ్‌సిఆర్‌ఎపై సీపీఐ(ఎం) ఎంపీ కీల‌క వ్యాఖ్య‌లు

ఎఫ్‌సిఆర్‌ఎపై సీపీఐ(ఎం) ఎంపీ కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ)కి సంబంధించిన సమాచారం రహస్యంగా ఉంచాల్సినదా అని సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ కేంద్రాన్ని నిలదీశారు. ఎఫ్‌సిఆర్‌ఎపై సాధారణ పార్లమెంటరీ ప్రశ్నలను సైతం మోడీ ప్రభుత్వం ‘రహస్య స్వభావం కలిగినవి’గా పరిగణిస్తోందని బుధవారం ఎక్స్‌లో వివరణాత్మక పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల నిర్ణయాలపై ప్రాథమిక సమాచారాన్ని సేకరించే యత్నాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. 2024 నుండి ఎఫ్‌సిఆర్‌ఎ తొలగింపు, రద్దు, పునరుద్ధరణను నిరాకరించడం, కొత్త రిజిస్ట్రేషన్లు, ఎఫ్‌సిఆర్‌ఎ డాష్‌ బోర్డ్‌ నుండి ఎన్‌జిఒల వారీగా ఉన్న సమాచారాన్ని ప్రజలకు లభించకుండా తొలగించడం వంటి అంశాలపై స్పష్టత కోరుతూ ఎనిమిది ప్రశ్నలను సమర్పించానని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రశ్నలకు ఎటువంటి స్పందన రాలేదని అన్నారు.

ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సుల రద్దుకు సంబంధించిన ప్రశ్నలన్నింటినీ రాజ్యసభ కార్యకలాపాల నిబంధన 47(2) (XXII) కింద అనుమతించలేదని పేర్కొన్నారు. అయితే ఈ నిబంధన రహస్య సమాచారాన్ని కోరే ప్రశ్నలను నిషేధిస్తుందని అన్నారు. అంటే ఎఫ్‌సిఆర్‌ఎకి సంబంధించిన సమాచారం రహస్యమా, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదా అని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. మార్చి 11న బడ్జెట్‌ సెషన్‌లో, ప్రస్తుత బడ్జెట్‌ సెషన్‌ సమయంలో ప్రభుత్వం వివాదాస్పద ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లును ఆమోదించడానికి కొన్ని వారాల ముందు అంటే 2026 మార్చి 11న ఎఫ్‌ఆర్‌సిఎ పోర్టల్‌ ప్రజలు యాక్సెస్‌ను ఎందుకు పరిమితం చేశారో తెలియజేయాలని తాను ప్రత్యేకంగా కోరినట్లు తెలిపారు.

రద్దైన ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సుల సంఖ్య, తిరస్కరణ, పునరుద్ధరించకపోవడానికి గల కారణాలు, ప్రజా నియంత్రణ డేటాకు ప్రాప్యత ఉపసంహరించుకోవడం వంటి ప్రాథమిక పార్లమెంటరీ ప్రశ్నలను వర్గీకృత సమచారంగా పరిగణించాలా అని ప్రశ్నించారు. తన తాజా ప్రశ్నను అనుమతించకపోవడానికి గల కారణం కూడా పోర్టల్‌ పేజీలో ఇప్పటికీ వెల్లడించలేదని అన్నారు. పారదర్శకత ‘రహస్యం’గా మారినపుడు, జవాబుదారీ తనం మొదట ‘బలి’ అవుతుందని అన్నారు. ఛారిటీ సంస్థలను ప్రభావితం చేసే నియంత్రణ నిర్ణయాల్లో అంత రహస్యం ఏముందని, పార్లమెంటులో కూడా ఆ సమాచారాన్ని వెల్లడించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -