ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రవికుమార్
రేపు కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-పెంబి
నిర్మల్ జిల్లా పెంబి మండల సమగ్ర అభివృద్ధి కోసం శనివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడత రవీందర్, పూసం సచిన్‌తో కలిసి యాపల్‌గూడ గ్రామంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు రవికుమార్ మాట్లాడుతూ.. మారుమూల మండలమైన పెంబి సమస్యలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకు వచ్చేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. దోత్తి, కడెం వాగులపై తక్షణమే వంతెనలు నిర్మించాలని, పులగంపండ్రి నుంచి సిరిచల్మా వరకు లింకు రహదారి నిర్మించాలని, పసుపుల-మందపెల్లి-రాజురా వంతెనల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అటవీ శాఖ అనుమతులను వెంటనే మంజూరు చేయాలని, అన్ని గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రికి రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్‌ను నియమించాలని, గిరిజన గ్రామాల్లో అంగన్వాడీ, ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేయాలని, పోడు సాగు భూములకు పట్టాలివ్వాలని, అన్ని గ్రామాల్లో మంచినీళ్ల సౌకర్యం కల్పించాలని, మిషన్ భగీరథ నీళ్లు అన్ని గ్రామాలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి చేరవేసి, తక్షణ పరిష్కారానికి సీపీఐ(ఎం) పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ పాదయాత్ర సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుంటుంది. అక్కడ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. పాదయాత్రలో ప్రజలు, రైతులు, కార్మికులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గౌతమ్‌కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, బొమ్మెన సురేష్, బి.వసుధ, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంభు, కామాక్షి, నాగెల్లి నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, గుమ్మెన గ్రామ ఉపసర్పంచ్ ధర్మరాజ్, కోసగుట్ట గ్రామ ఉపసర్పంచ్ పగ్గు పాల్గొన్నారు.


