– సామినేని హత్య దారుణమైన ఘటన
– సామినేని హంతకులను వెంటనే అరెస్టు చేయాలి
– దేశవ్యాప్తంగా రామారావు సమస్మరణ సభలు
– ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్
నవతెలంగాణ – బోనకల్
సామినేని రామారావు హత్య దారుణమైన ఘటన అని దేశవ్యాప్తంగా రామారావు సమస్పూర్ణ సభలో నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్ తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు సామినేని రామారావు కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సామినేని రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామినేని రామారావు భార్య స్వరాజ్యం, కుమారుడు విజయకుమార్ ని పరామర్శించి ఓదార్చారు. సంఘటన జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్వరాజ్యం తన భర్తను కాంగ్రెస్ గూండాలు రాజకీయంగా ఎదుర్కోలేకనే అత్యంత కిరాతకంగా హత్య చేశారని వివరించారు. హంతకులను వెంటనే అరెస్టు చేసే విధంగా పార్టీ నాయకులు కృషి చేయాలని ఆమె ఆయనను కోరారు. అనంతరంసంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు.ఆనాటి సంఘటన జరిగిన తీరును ఆయనకు మడిపల్లి గోపాలరావు, కుమారుడు విజయకుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సామినేని రామారావు మృదు స్వభావి అని అన్నారు. రైతు సమస్యలపై తాను రామారావు కలిసి 2009 పనిచేశామన్నారు.
రైతు సమస్యలపై సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి ఆయన అన్నారు. రామారావు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేసిన సమయంలో రైతు సంఘం సమావేశాలలో పాల్గొనేందుకు తాను ఢిల్లీ నుంచి వచ్చే వాడినని తెలిపారు. రామారావు రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో వివరిస్తుంటే తాను అనేకసార్లు ఆశ్చర్యపోయానన్నారు. రామారావు దమ్మున్న నాయకుడు అన్నారు. ప్రతినిత్యం రైతు సమస్యలపై ఆలోచించే వారన్నారు. రామారావుతో తనకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అటువంటి వ్యక్తి రైతు సంఘంలో పనిచేయటం గర్వకారణం అన్నారు. రామారావు జనప్రియ నేత అన్నారు. అదే వర్గ శత్రువులకు భయం పట్టుకుందన్నారు. అభయంతోనే కాంగ్రెస్ గుండాలు రామారావుని హత్య చేశారన్నారు. పాతర్లపాడు గ్రామ సర్పంచ్ గా 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేయటం అంటే మామూలు విషయం కాదన్నారు.
రామారావు హత్య విషయంపై తెలంగాణ రాష్ట్ర సీపీఐ(ఎం) నాయకులు మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డిని కలిసి వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అఖిల భారత కిసాన్ సభ నాయకత్వంలో అమరారంతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రామారావు చూపిన దారిలో మనం అందరం కలిసి పనిచేయాలన్నారు. వర్గ శత్రువులపై పోరాటం చేయటమే మనం రామారావుకి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. మన పార్టీ బలం పెంచుకోవాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. హంతకులను అరెస్టు చేసే వరకు తాము ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పి జగ్గారెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మూడ్ శోభన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మండల కార్యదర్శి రాచబంటి రాము, సీపీఐ(ఎం) బోనకల్ మండల కార్యదర్శి కిలారు సురేష్, తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) చింతకాని సీనియర్ నాయకులు వత్సవాయి జానకి రాములు, కొండ్రు జానకి రామయ్య, మునికుంట్ల సుబ్బారావు, పాతర్లపాడు సిపిఎం నాయకులు, తదితరులు ఉన్నారు.



