56మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు
తిరువనంతపురం : కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)కు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది. తాను పోటీ చేస్తున్న 81 స్థానాల్లో (ఆరుగురు స్వతంత్రులు సహా), సీపీఐ(ఎం) 56 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిలబెట్టింది. ఈ నిర్ణయం వారిపై పార్టీ విశ్వాసాన్ని, తన శాసనసభ్యులపై ప్రజల్లో అభిమానం ఉందనే నమ్మకాన్ని ప్రదర్శిస్తుందని సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. 2021లో 10 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించగా, ఈ ఎన్నికల్లో 12 మందికి అవకాశం కల్పించింది.
ధర్మదం నుంచే విజయన్ పోటీ
ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూర్ జిల్లాలోని ధర్మదం స్థానం నుంచి పోటీ చేస్తారు. సీఎంతో పాటు, ఎల్‌డిఎఫ్‌కు చెందిన తొమ్మిది మంది మంత్రులు బరిలో దిగారు. జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నాయకులు, కొందరు కొత్త వారు ఉన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్, ఇతర సీనియర్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఎర్నాకులం, పాలక్కడ్ సహా ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను తరువాత ప్రకటిస్తారు.
బరిలో సీనియర్ నాయకులు, సిట్టింగ్ మంత్రులు
సిహెచ్ కున్హంబు, కెకె శైలజ, సి రవీంద్రనాథ్ వంటి సీనియర్ నాయకులు బరిలో ఉన్నారు. వి శివన్‌కుట్టి, వీణా జార్జ్, టిఎన్ వాసవన్ వంటి పలువురు సిట్టింగ్ మంత్రులు పోటీ చేస్తున్నారు. గతసారి మట్టన్నూర్ నుంచి రికార్డు స్థాయిలో 65,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన కెకె శైలజ ఇప్పుడు పెరవూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. మాజీ మంత్రి ఎంఎం మణి, స్పీకర్ ఎఎన్ షంసీర్ జాబితాలో లేరు. కెకె జయచంద్రన్ మణి స్థానం నుంచి పోటీ చేస్తుండగా, షంసీర్ స్థానంలో తలస్సేరిలో కారారు రాజన్ పోటీ చేస్తున్నారు. తాలిపరంబా స్థానంలో మహిళా అసోసియేషన్ నాయకురాలు పి కె శ్యామల తన భర్త, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ స్థానంలో పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కొల్లం ఎమ్మెల్యే, నటుడు ఎం ముకేశ్ స్థానంలో ఎస్ జయమోహన్ బరిలో దిగుతున్నారు.
త్రిముఖ పోటీ స్థానాల్లో సిట్టింగ్‌లు
ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య త్రిముఖ పోటీ జరగనున్న నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) తన సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపింది. వట్టియూర్కావులో సీపీఐ(ఎం) అభ్యర్థిగా వికె ప్రశాంత్, నేమోమ్ నుంచి వి శివన్‌కుట్టి పోటీ చేస్తారు. మట్టన్నూర్‌లో, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి వికె సనోజ్ బరిలోకి దిగనున్నారు. సీపీఐ(ఎం) మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు, సీనియర్ నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. కెటి జలీల్, ప్రస్తుత క్రీడలు, వక్ఫ్ మంత్రి వి అబ్దుల్ రహిమాన్, కొల్లంలో సుజిత్ విజయన్ తదితరులు పోటీ చేస్తున్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో, రాష్ట్రంలోని 140 సీట్లలో 99 స్థానాలను ఎల్‌డీఎఫ్ గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన దానికంటే ఎనిమిది సీట్లు ఎక్కువగా గెలుచుకోవడమే కాకుండా, దాని ఓట్ల వాటాను 43.5 శాతం నుంచి 45.43 శాతానికి పెంచుకుంది.ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) 41 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.




