ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో సత్తాచాటిన మార్క్సిస్టులు
పలుచోట్ల ఉపసర్పంచ్‌ల కైవసం
వందల సంఖ్యలో వార్డుల గెలుపు
నవతెలంగాణ- విలేకరులు
మలిదశ పోరులోనూ సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులు విజయాలను అందుకున్నారు. ఆయా మండలాల్లో సర్పంచ్, వార్డుస్థానాలను భారీగా కైవసం చేసుకున్నారు. పోటీచేసిన కొద్ది స్థానాల్లోనూ సీపీఐ(ఎం) పార్టీ సత్తాచాటింది. రాష్ట్రవ్యాప్తంగా 41 గ్రామాలు కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14 చోట్ల పార్టీ బలపరచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లో 20 సర్పంచ్ స్థానాల్లో పోటీచేసి 14 చోట్ల ఎర్రజెండాను ఎగురవేశారు. ఖమ్మం జిల్లాలో 14, కొత్తగూడెం జిల్లాలో ఆరు, సూర్యాపేటలో ఎనిమిది, యాదాద్రి భువనగిరిలో ఐదు, నల్లగొండ జిల్లాలో నాలుగు చోట్ల విజయం సాధించారు. నారాయణపేట జిల్లాలో నాలుగు, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాలో ఒక్కోక్క గ్రామ పంచాయతీని సీపీఐ(ఎం) కైవసం చేసుకుంది. పలుచోట్ల ఉప సర్పంచ్ పదవులు లభించాయి. అయితే వందకుపైగా వార్డుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
సూర్యాపేట జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 8 గ్రామ పంచాయతీలను సీపీఐ(ఎం) గెలుచుకున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. మునగాల మండల పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల్లో పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. కలకోవలో-మండవ వెంకటాద్రి, జగన్నాథపురం-బొల్లం యమునా, కొక్కిరేణి-దాసరిశీను, నర్సింహులగూడెం-కుంచం ఇందిరా, నారాయణగూడెం- కాంపాటి వెంకటేశ్వర్లు, చిలుకూరు మండలం కొండాపురంలో బాబు గెలుపొందారు. భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం చీమలకొండూర్ గ్రామసర్పంచ్‌గా పల్లెర్ల అంజయ్య, అనాజిపూర్ సర్పంచ్‌గా సురేశ్ విజయం సాధించారు. రామన్నపే మండలం మునిపంపులలో బొడ్డుపల్లి వెంకటేశ్, దుబ్బాకలో నర్సింహ, వలిగొండ మండలం సుంకిశాలలో సంధ్యారాణి గెలుపొందారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజక వర్గంలో నలుగురు సీపీఐ(ఎం) అభ్యర్థులు గెలుపొందారు.
మిర్యాలగూడ మండలం కుంటకిందితండాలో రూపావతురాజు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. భాగ్య గోపసముద్రంలో మూడవత్ సరస్వతి రవినాయక్, గూడూరు గ్రామంలో బొగ్గారపు కృష్ణయ్య గెలుపొందారు. బోటినాయక్‌తండాలో శ్రీనునాయక్, రాయిపాలెంలో కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి ఉపసర్పంచ్‌లుగా విజయం సాధించారు. దామరచర్ల మండలంలో గాంధీనగర్‌లో పోలగాని ఎల్లమ్మవెంకటయ్య గెలుపొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామ సర్పంచ్‌గా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ గన్నేరం వసంత నర్సయ్య 75 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చీట్టోజీపల్లి లో లక్ష్మి నరసయ్య సర్పంచ్‌గా గెలిచారు. ఆమె మెదక్ జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఎనిమిది వార్డు స్థానాలకు గాను ఐదు స్థానాలు కైవసమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల ఒకటవ వార్డులో సీపీఐ(ఎం) విజయం సాధించింది. గోపాలపురం, సీతంపేట గ్రామ పంచాయతీలో రెండు, ములకనూరులో రెండు వార్డుల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.
నిర్మల్ జిల్లాలో… లోకేశ్వరం మండలం జోహార్‌పూర్ గ్రామ ఉప సర్పంచ్‌గా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు ద్యావత్ పోశెట్టి ఎన్నికయ్యారు. ఇదే మండలం పుస్పూర్ గ్రామ వార్డు మెంబర్‌గా బండి వసంత విజయం సాధించారు. అదే విధంగా దిలావర్‌పూర్ మండలం కంజర్ గ్రామ ఉప సర్పంచ్‌గా గంగారాం ఎన్నికయ్యారు. మొదటి విడత ఎన్నికలు జరిగిన పెంబి మండలం యాపల్‌గూడ ఉప సర్పంచ్ ఎన్నిక ఆదివారం జరిగింది. సీపీఐ(ఎం) వార్డు సభ్యునిగా గెలిచిన అర్కా నాగోరావు గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం గూడరాంపూర్‌లో వార్డు సభ్యునిగా సీపీఐ(ఎం) అభ్యర్థి జి.స్వామి గెలుపొందారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడలో 10వ వార్డు సభ్యురాలిగా సిడాం మీరాబాయి గెలుపొందారు.
నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలంలో నాలుగు సర్పంచ్ స్థానాలు సీపీఐ(ఎం) కైవసం చేసుకుంది. అదేవిధంగా 25 వార్డుల్లోనూ విజయపతాకం ఎగురవేశారు. ఉడ్మల్‌గిద్దలో సత్యమ్మ గోపాల, ముస్తాపేట్- సరస్వతి అంజిలయ్యగౌడ్, దేశాయిపల్లి -లాలప్ప, అయ్యవారి పల్లిలో అనంతమ్మ గెలిచారు. వనపర్తి జిల్లా పరిధిలోని అమరచింత మండలంలో మూడు వార్డులు, ఆత్మకూరులో ఒక వార్డులో ఎర్రజెండా ఎగురవేశారు.
ఆసిఫాబాద్ జిల్లా రాంపూర్ సర్పంచ్ స్థానం సీపీఐ(ఎం) కైవసం
కుమురం భీం – ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం రాంపూర్ గ్రామపంచాయతీలో సీపీఐ(ఎం) అభ్యర్థి కొఠారి రాజలింగు ప్రత్యర్థిపై 124 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. పార్టీ మండల కమిటీ సభ్యులు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రాజలింగు గెలుపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఇక్కడ ఏడు వార్డులను సైతం పార్టీ కైవసం చేసుకుంది. ఖర్జీ పంచాయతీలో ఒక వార్డులో దిగడ బక్కన్న విజయం సాధించారు. పీపీ రావు కాలనీ పంచాయతీ వార్డు సభ్యురాలిగా మెరిపెల్లి లక్ష్మీ విజయం సాధించారు.



