‘తిమ్మిరి బిళ్లలు తొడపాశాలు’ పుస్తకం పేరే గమ్మత్తుగా ఆకట్టుకునేలా ఉంది. లోపలి రాతలు కూడా నిలబెట్టేస్తాయి. ఆలోచింపజేస్తాయి. యువత పెడదోవ పడుతోంది, లేదూ సమాజం గురించి పట్టించుకోవడం లేదు అనే బాధను కొంతమేర తగ్గిస్తుంది ఈ పుస్తకం.
కవితలు, నానీలని విన్నాం, చదివాం. ఇందులోనివి అవేవీ కావు. ‘జువ్వలు’. ఈ పేరును ఈ యువకులు ఖాయం చేసిందే. పుస్తకం పేరు మొదలుకొని, బుక్ మేకింగ్, ఇందులోని ‘జువ్వలు’ వరకు… అంతా మొలకెత్తిన కొత్తదనమే.
చాలా సాదా సీదా మాటలే. యతి, ప్రాసలు కూడా ఏమీ ఉండవు. ఒక మెరుపును, ఒక కుదుపును మనలో కలిగిస్తాయి. హెడ్డింగ్ ఉండాలనే నియమం కూడా ఏమీ పెట్టుకోలేదు.
ప్రతి ‘జువ్వ’కు వేసిన బొమ్మల గురించి చెప్పాల్సిన పనే లేదు. కొన్ని ‘జువ్వ’లు బొమ్మ లేకపోతే సంపూర్ణ కావు. కొన్ని ‘జువ్వలు’ మీరు అందుకోండి.
స్త్రీపై అణచివేత నంతటినీ ఎంత సింపుల్ గా చెప్పారో… ”తనకు/ కలలోనే స్వేచ్ఛ దొరుకుంతుందని/ గ్రహించి/ ఆ రోజు కాస్త త్వరగా పడుకుంది”.
మరో ‘జువ్వ’లో… ”బలికి పోతును పెంచినట్టు/ పందానికి పుంజును పెంచినట్టు/ ఆడపిల్లను…”.
మానవ సంబంధాల పట్ల, పెద్దల విలువ తెలిసికొన్న వీరికి వారిపట్ల ఎంత ప్రేమనో… ”నానమ్మా తాతయ్యలకు/ కాల్ చేసి చెప్పండి/ మీరున్న చోట వాన కురుస్తుందని”.
బతుకు అభద్రతను గురించి… ”మా వాచ్మెన్ పేరు సుబ్బారావ్/ చాలా మర్యాదస్తుడు/ నిద్ర కూడా చేతులు కట్టుకుని పోతాడు”.
ఎస్కేపిస్ట్ ల గురించి, స్వార్థపరుల గురించి రెండు ‘జువ్వ’లు… ”ఈదడమా?/ ఎదురీదడమా?/ అసలు ఒడ్డునే కూర్చుంటే…”.
బహుశా రూపాంతరం చెందే కుల సంబంధాల గురించి లేదా శ్రమ విభజన గురించి… ”ఈ కాలంలో కూడా/ ఇంకా ఎక్కడుంది కులం?” అనే అసంపూర్తి ఈ ‘జువ్వ’ను బొమ్మ పరిపూర్తి చేస్తుంది.
బొమ్మలో… ‘పనివాళ్లు లిప్ట్ని ఉపయోగించారాదు’ అని అతికించడంతో పాటు, లిప్ట్ పక్కన పనివాళ్లు విడిచిన చెప్పులు ఉంటాయి. ఏ మనిషి రాజకీయాలకు దూరంగ జీవించలేరు అనడానికి.. ఓ తొడపాశం… ”అబ్బే!/ మనకీ రాజకీయాలు ఎందుకండీ… సుబ్బరంగా తినుండక./ అయ్య బాబోరు!/ కేజీ కందిపప్పు నూటేభయ్యా!!!”.
పదవులు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఎట్లా మారతారో చెప్తూ… ”రాజ్యాంగం పట్టుకుని/ దీక్షలు చేసి/ అధికారం వచ్చాక/ అయ్యప్ప దీక్షలో కూర్చున్నాడు”.
తొడపాశలతో పాటు తిమ్మిరి బిళ్లలూ ఉన్నాయి… ”టైమెంత/ ఏమో! ఒక చోట ఆగట్లేదు”.
గుడిబయట చెప్పులను శుభ్రత కోసం విడుస్తారు అనుకునేదాన్ని. కానీ శరత్, మెట్ల (ఇద్దరూ వేర్వేరు)లు కొత్తగా చెప్పారు. ”దేనికీ/ గొడ్డు చర్మంతో చేస్తారనేగా?” అని. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ‘జువ్వ’ ఒక మెరుపు.
‘ఒక’ అనే ప్రచురణ సంస్థ నుంచి వెలువడిన మొట్టమొదటి పుస్తకం ఇది. ప్రచురణ కర్తలు సిద్ధార్థ కట్టా, వికాస. బొమ్మలతో ‘జువ్వ’కి ప్రాణం పోసిన వారు చరణ్, హారిక, సొలొమన్ విజరు కుమార్. లే అవుట్ మహిళా బెజవాడ. కవర్ పేజీ చాలా బాగుంది. రచయితలు శరత్, మెట్ల కూ ఇది మొదటి పుస్తకమే. ఈ పుస్తకం వెలువడటానికి పని చేసిన అందరికీ అభినందనలు – సమాజానికి దూరంగా విహరించనందుకు.
– తాయమ్మ కరుణ, 9010201880
తిమ్మిరి బిళ్లలు తొడపాశాలు
- Advertisement -
- Advertisement -