పాగల్ ప్రేమి అంటే ప్రేమపిచ్చోడని, విసుగూ విరామం లేకుండా ప్రేమిస్తాడని మన కథలు, సినిమాలు చెబుతాయి. అలాంటివారు కొందరు మన నిత్య జీవితంలో కనిపిస్తుంటారు కూడా. ఇక ఘాయల్ ప్రేమి అంటే గాయపడ్డ ప్రేమికుడన్నమాట. గాయపడ్డమంటే ఏదో ప్రమాదంలో గాయాలైనాయని కాదిక్కడ చెప్పదలచింది, మనసు గాయపడ్డవాడని అర్థం. ఎందుకు ఈ పాగల్ , ఘాయల్ ప్రేమికుల గురించి చెబుతున్నావని అడిగేవారికి ఆ రెండు క్యాటగిరీలపై ఇంకొంత చెప్పుకున్నాక అసలు విషయానికి పోదాము. మడిసన్నాక కూసంత కలాపోషణ ఉండాలికదా, అదీ ఆదివారంనాడు మనసుకు కాస్త ప్రశాంతతను, కాస్త వినోదాన్ని పంచడం మన బాధ్యత. అలాగని సమాజంలో ఉంటూ అదే సమాజానికి మనం ఏ బాధ్యత వహిస్తున్నామన్నది కూడా చూసుకోవాలి. మడిసన్నాక కాస్త బాధ్యత కూడా అవసరమని కొత్తగా చెప్పుకుందాం.
పాగల్ ప్రేమి తన ప్రేమపిచ్చిలో అది నిజమనుకొని, తనకు అనుకూలంగా మారుతుందని పిచ్చిగా నమ్మేవాడన్నమాట. మహర్షి రాఘవలాగ జీవితాంతం ఆమెనే ప్రేమిస్తానని చెప్పేవాడన్నమాట. ప్రేమ తప్ప ఇంకో బాధ్యతగాని, బరువుగాని లేకుండా ఊరకే తన మనసు బరువుతో నింపుకునేవాడు ఈ పిచ్చోడు. మా మిత్రుడికి ఇంకో మిత్రుడున్నాడు, ఒకమ్మాయిని ప్రేమించాడు ఏకపక్షంగా. అది ఒకవైపు మాత్రమే నడచిన ప్రేమకథ. అసలక్కడ కథే లేదు ఒక అక్క, ఒక బావ అది కథ అంటె ఇందులో కథెక్కడుందిరా అంటాడు కదా సరిగ్గా అలాంటిదన్నమాట. సరే ఆ అమ్మాయికి పెళ్లి ఐపోయింది. వెంటనే అతను చెప్పిన డైలాగు వింటే ఆశ్చర్యమవుతుంది. పెళ్ళైన అమ్మాయి ఎటూ తన భర్తతో కాపురానికి వెళ్లిపోయింది. అందుకే తన హృదయంలో ఎవరో ప్రవేశించారని చెప్పేసరికి మా మిత్రుడు కొద్దిగా ఖంగుతిన్నాడు. ఎవరురా అంటే, తన మాజీ ప్రేమికురాలు పెళ్లికూతురి చెల్లెలేనని చెప్పాడు. మా మిత్రుడనుకున్నాడు పోరా పిచ్చోడా ఇలా అనుకుంటూనే ఉండు ఏ యాభైయ్యో అరవయ్యో వయసొచ్చినాక పెళ్లిచేసుకుందువు అని. ఐనా ఈ ప్రేమ పిచ్చోళ్లు కిషోర్ కుమార్ పాటలోలాగ మైహూ ఎక్ పాగల్ ప్రేమి మెర దర్ద్ నకోయి జాన అన్నట్టి తన బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరనుకుంటూ ఉంటారు.
అసలు భంగపడ్డ ప్రేమికుడు ఎలా ఉండాలో మన సినిమాలు ఎప్పుడో నిర్దేశించాయి. దేవదాసులాగ గడ్దం పెంచి, శాలువా కప్పుకొని, చేతిలో సిగరెట్టు, మందు బాటిల్ ఉంటుందని అందరూ అలాగే ఫాలో అవుతున్నారు. మీ స్క్రీను ఎడమవైపు కింద చిన్నగా పొగతాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం అని పడుతున్నట్టు ఫీలవ్వమని నా మనవి. ఇక దేవదాసులాగ ఇంట్లో పెద్దవాళ్లని, సమాజాన్ని ఎదిరించలేని వాళ్లు గాయపడ్డ ప్రేమికులే అవుతారు. ఐతే తన ప్రేయసి జీవితాంతం హాయిగా ఉండాలని తన ప్రేమను ప్రకటించేటంత నిజమైన ప్రేమికుడు దేవదాసు. తమ ప్రేమను అంగీకరించకుంటే యువతలో కొందరేమి చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ ఘాయల్ ప్రేమికులు పాగలై, అంతకంటే పాగలై ప్రేమించినాము అనుకునే వాళ్లకే హాని తలపెడుతున్నారు.
ప్రేమకథలు చదువుతుంటే ఎప్పుడేమవుతుందోనన్న ఉత్కంఠ.
వాటిలో సుఖాంతాలు, దు:ఖాంతాలుగా ఉంటాయి. షేక్‌స్పియర్ నాటకాల్లో ఎక్కువగా దు:ఖాంతాలే ఉంటాయి. కామెడీవి కూడా ఉంటాయి. అలాగే ఈ ఎన్నికల ఫలితాలు కూడా కొందరికి సుఖాంతాలు, ఇంకొందరికి దు:ఖాంతాలుగా ఉంటాయి. మొదటిసారి ఖాతా ఖోలామని చెప్పుకునేవారు బయటినుండి వచ్చిన ప్రత్యేక ఓటుతో గెలుస్తారు కూడా. ఎలా గెలిచామన్నది కాదు బాసూ, గెలిచామా లేదా అన్నది అసలైన పాయింటు. ఆ పాయింటు మాకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు అనొచ్చు, అనుకోవచ్చు కాని అది చావు తప్పు కన్ను లొట్టపోయిందంటారు కదా ఆ క్యాటగిరీలోకి వస్తుంది. ఇంకోసారి రెండు కళ్లూ లొట్టపోయే అవకాశమూ ఉంది. ఓడిపోయిన ఘాయల్ ప్రేమీలు తరువాత జరిగే ఎన్నికలవరకు ఘర్‌వాపసీ అనుకుంటూ ఇంట్లో కూచోవాల్సిందే. దీనికి కారణమైన వోట్లేయని వాళ్లదగ్గరికి పోయి పైసా వాపసీ అంటూ తామిచ్చిన సొమ్ము, బహుమతులు వెనక్కివమని అడుగుతున్నారు, ఎందుకివ్వాలని వాళ్లూ ఎదురుతిరిగి అడగడం చూస్తే మన ప్రజాస్వామ్యం వాపసీ వస్తే ఎంతబాగుంటుందని నిజమైన దేశప్రేమికులు అనుకుంటారు.
ఎన్నికలయ్యాక గెలిచినవారిని జాగ్రత్తగా ఫారం కోడిపిల్లల్లా తీసిపెట్టి సభకు తీసుకొచ్చే విధానమొకటుంది. పాగల్ ప్రేమీలు ఘాయల్ ప్రేమికులు కాకూడదంటే, బాబీ సినిమాలోలాగ అందరినీ లోపలపెట్టి అందర్‌సే కొయి బాహర్ నా జాసకే అని పాడుకునేలా ఉండాలి. అంతంత ఖర్చుపెట్టి గెలిపించుకున్నాక ఆమాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా అధ్యక్షా అని బలవంతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానాలుంటాయని మనం చూస్తున్నాం. మిత్రుడు శీను ఈ క్యాంపు కార్యాలయాలపై ఎన్నికల మరుసటిరోజే రాశేశాడు. సంక్రాంతి కోళ్లను జాగ్రత్తగా పట్టుకొచ్చినట్టు, ఐ.పి.ఎల్‌లో కొన్న క్రీడాకారులను, బాగా చూసుకొని మంచి తిండిపెట్టి బాగా ఆడించి కప్పు కొట్టినట్టు ‘అందర్’లో పెట్టిన గెలుపు గుర్రాలను రేసులో సరిగా వాడుకోవడం ఒక కళ. పెద్దోళ్లు బౌన్సర్లను పెట్టుకొని బాగా సాకడం చూస్తూనే ఉన్నాం. గెలుపు గుర్రాలపై ఎంత నమ్మకమున్నా ప్రతి ఎన్నిక రాజకీయ పార్టీలకు ఒక ప్రేమికులరోజే….. పాగల్ చేస్తారో, ఘాయల్ చేస్తారో నిర్ణయించేది మాత్రం ప్రజలే….
జంధ్యాల రఘుబాబు
9849753298


