Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeకవితతల మాసిన మనుషులు

తల మాసిన మనుషులు

- Advertisement -

అతను నాతో నా తల మీద కత్తెరల
భాషతో మాట్లాడతాడు.
తల మర్దనల పదమార్దవాలతో
సంభాషణ చేస్తాడు.
తల విరుపులతో చరుపులతో
ఒకింత తల బలుపును విరిచేస్తాడు.
నా మనసు తెలుసన్నట్టు
అతని కత్తిరింపుల కనికట్టు
నా తలకు తలకట్టు కడుతుంది.
అతని ముంగిలికి వచ్చినపుడు
తలపనికి వచ్చినట్టుండదు.
ఊరి విశేషాలు సశేషాలు వినపడే
రచ్చబండకు
మనపని మీద వచ్చినట్టుంటుంది.
అతను మంగలి మాత్రమే కాదు.
మంగళకరుడు.
అతను నాకు బంధువే కాదు.
ఆత్మ బంధువు.
పెళ్ళికి, చావుకి అతని మేళం
ఊరి జ్ఞాపకం.
పిలిస్తే ఇంటికొచ్చి పనిచేసే అక్కర.
ఊర్లో తలకాయలకు తలలో నాలుక.
ఆ రోజుటి కష్టమంతా
ఒక పక్కకు చిమ్మేస్తాడుగానీ
విధి అతని సంసారాన్ని
మరోవైపుకి చిమ్మేస్తుంది.
పనిలేని మంగలోడని
ఊరి అగ్రహారాలు ఈసడించాయి గానీ
నిజంగానే ఇప్పుడు
ఊర్లో కొచ్చిన కార్పోరేట్‌ కత్తెరలు
ఆ కాస్త పని కూడా లేకుండా
మంగలి జీవితాలు గొరిగేస్తున్నాయి.
ఏ.సి సెలూన్‌, స్పాల దెబ్బకి
కొట్టులు, బంకులు కుదేలయి
సన్నాయి మేళాలు కత్తెర శబ్దాలు మూగబోయాయి.
ఆధునిక వత్తి పనితనం
అతని జీవికను చెరిపేస్తున్నాయి.
పట్టెడన్నం కోసం పరుగుపందెంలో
మోకు, ముస్తాదు వదిలి నేను –
మంగలి పెట్టె పగిలిపోయి
గుండెగొంతు మీద గాటులతో అతను –
వత్తులు మత్తికలవుతున్న
ఈ చారిత్రక కాల మలుపులో
అలసిన ఈ పాతకాలపు
తలమాసిన మనుషులు చేసే
ఆర్తనాదాలు ఎవరు వింటారు?
– పి.శ్రీనివాస్‌ గౌడ్‌, 9949429449

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img